
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరి ప్రియనాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఆమెను రైతులు అడ్డుకున్నారు. తడిసిన మొక్కజొన్నను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా.. కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆమెను నిలదీశారు. 20 రోజుల నుంచి మొక్కజొన్నను కాపలా కాయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో సగానికి సగం పంట నష్టపోయామని.. ఇప్పటికైనా మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ ను కూడా రైతులు అడ్డుకున్నారు. తమకు న్యాయం జరిగేవరకు కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రైతులను చెదరగొట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.