- మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా
మెట్ పల్లి, వెలుగు : మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కలు కొనాలని డిమాండ్ చేస్తూ గురువారం మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రైతులు ధర్నా చేశారు. రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
చేయకపోవడంతో మక్కలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. వారం క్రితం రూ.2200 చెల్లించిన వ్యాపారులు తమ అవసరాన్ని ఆసరాగా చేసుకుని రూ.1800 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల క్రితం కురిసిన అకాల వర్షాలకు మక్కజొన్న పంట దిగుబడి తగ్గిందని, వచ్చిన పంటనైనా అమ్ముకుందామంటే సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర లేక నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత ఆర్డీవో దూలం మధుకు వినతిపత్రం అందజేశారు. రైతులు కంటి ప్రమోద్, మోహన్, మహేందర్, సంజీవ్, సురేష్, రమేశ్, శశి, లింగారెడ్డి పాల్గొన్నారు.