యాదాద్రి, వెలుగు : వడ్లు కొంటలేరంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ మండలానికి చెందిన రైతన్నలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ఎదుట వడ్లు పారబోసి నిరసన తెలిపారు. వడ్ల కొనుగోలులో స్టాఫ్, లారీ డ్రైవర్లు, మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారంటూ రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వారం కావస్తున్నా చాలా సెంటర్లలో కాంటా పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. గన్నీ బ్యాగుల బరువు పేరుతో 40 కిలోల బస్తాకు కిలోన్నర ఎక్కువ తూకం వేస్తున్నారన్నారు.
కాంటా పెట్టిన తర్వాత కూడా వడ్లను మిల్లులకు సరిగ్గా పంపించడం లేదన్నారు. వడ్లు తీసుకోవడానికి వచ్చే లారీ డ్రైవర్లు 40 కిలోల బస్తాకు రూ. 2 చొప్పున ఇస్తేనే తీసుకెళ్తామని అంటున్నారని వాపోయారు. మిల్లు వద్దకు వడ్లు చేరిన తర్వాత మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని ఆరోపించారు. ఏ గ్రేడ్ వడ్లను కామన్ గ్రేడ్ కింద మారుస్తున్నారని, ఈ కారణంగా క్వింటాల్‌కు రూ.20 చొప్పున నష్టపోవాల్సి వస్తుందన్నారు. తేమ పేరుతో 40 కిలోల బస్తాకు 2 నుంచి 3 కిలోలు కోత విధిస్తున్నారని ఆవేదన చెందారు. క్వింటాల్వడ్లకు 5 కిలోల వరకు కోల్పోతున్నామన్నారు.
ఆఫీసర్లు కూడా మిల్లర్ల పక్షానే మాట్లాడుతున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి రాస్తారోకో విరమించాలని కోరినా రైతులు వెనక్కి తగ్గలేదు. చివరకు ఐదుగురు రైతులను కలెక్టరేట్‌లోనికి అనుమతించగా వారు అడిషనల్ కలెక్టర్ పి. బెన్ షాలోమ్‌ను కలిసి ఇబ్బందులను వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.