- నేలకొరిగిన వరి, మక్క పంటలు.. రాలిన మామిడి
- కల్లాల్లో ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయినయ్
- కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన ధాన్యం
- పంట నష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వనున్న వ్యవసాయ శాఖ
- విద్యుత్ లైన్లపై చెట్లు కూలి అనేక చోట్ల నిలిచిన కరెంట్ సప్లై
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒక్క రోజు కురిసిన భారీ వర్షం కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెడగొట్టు వానతో చేతికొచ్చిన పంట నష్టపోయి ఆగమయ్యారు. కొన్ని చోట్ల కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. భారీ వర్షం కురిసిన చోట్ల వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల కొనుగోలు సెంటర్లలోనూ ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు లేక ఇండ్ల నుంచి కవర్లు తెచ్చి కప్పినా అప్పటికే నష్టం జరిగిపోయింది. పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సెంటర్లలో వర్షపు నీరు నిలిచింది. వడ్లకుప్పల కింది నుంచి నీరు ప్రవహించి ధాన్యం తడిసిపోయింది. ఇయ్యాల్నో, రేపో కాంటా అవుతుందనుకుంటున్న సమయంలో వర్షం పడి వడ్లు తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల ధాన్యం కాంటా వేసి పదిహేను రోజులు గడుస్తున్నా తరలించకపోవడంతో తూకం వేసిన వడ్ల బస్తాలు కూడా తడిసిపోయాయి. సెంటర్లలో నిర్వాహకుల జాప్యం వల్లే ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం తరలించడంలోనూ నిర్లక్ష్యం చూపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంటా వేసిన ధాన్యం బస్తాలను వెంట వెంటనే మిల్లులకు పంపాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ధాన్యం తరలించేందుకు లారీల కొరత ఉండటంతో తూకం వేయడంలో తీవ్రజాప్యం చేస్తున్నారని అంటున్నారు. అయితే, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత కొనుగోలు చేస్తామని సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రకటించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సెంటర్‌కు వచ్చిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. సెంటర్లలో తూకం అయిన ధాన్యం వెంట వెంటనే మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బంది కలుగుకుండా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్‌కు అంతరాయం
భారీ గాలులతో వర్షం కురవడంతో అనేక చోట్ల11 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లపై చెట్లు కూలాయి. చెట్లు కూలి విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపోయాయి. దీంతో పలు చోట్ల అంతరాయం కలిగింది. విద్యుత్ సిబ్బంది రిపేర్లు చేసి కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ఆల్వాల్‌లో 11 కేవీ ఫీడర్ దెబ్బతిని సమస్య ఏర్పడింది. వినాయకనగర్, ఇతర పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి 33/11 కేవీ లైన్లు దెబ్బతిన్నాయి.
పిడుగుల కారణంగా 33 కేవీ విద్యుత్ స్తంభాలపై ఉన్న ఇన్స్యులేటర్లు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలులతో కరెంట్ తీగలపై చెట్లు కూలడంతో వందలాది స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడడంతో కరెంటు సరఫరాపై ఎఫెక్ట్ పడింది. హైదరాబాద్ శివార్లలో పలు చోట్ల గంటల కొద్దీ సమయం కరెంటు సరఫరాకు ఇబ్బంది ఏర్పడింది. కొన్నిచోట్ల సరఫరా పునరుద్ధరణకు 24 గంటల టైమ్ పట్టింది. కరెంట్ సప్లై పునరుద్ధరించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సబ్స్టేషన్ల వద్ద ఆందోళన చేపట్టారు.
వరి, మామిడి, మక్కలపై ఎఫెక్ట్
చెడగొట్టు వానల వల్ల పొలాల్లోని పంటలపై కూడా తీవ్రమైన ప్రభావం పడింది. బలమైన ఈదురుగాలులకు తోడు వడగండ్ల వానలతో కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. కోత దశలో ఉన్న మక్క పంటలూ దెబ్బతిన్నాయి. గాలిదుమారం, వడగండ్ల దెబ్బకు చివరిదశలో ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి. కాగా, రాష్ట్రంలో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.