రైతుల ఆత్మహత్యలు ఆగేదెన్నడు? : చింత ఎల్లస్వామి

ప్రముఖ ఆర్థిక వేత్త గుర్నాల్ మిర్దల్ అన్నట్లు.. రైతు అప్పుల్లో పుడుతున్నాడు.. అప్పుల్లోనే పెరుగుతున్నాడు.. చివరకు అప్పుల్లోనే మరణిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు దాటినా, రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతంలో నీటి కొరత, కరువు కాటకాలు, కరెంటు కోతలతో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రైతుల జీవితాలు బాగుపడతాయని, వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయని భావిస్తే.. స్వరాష్ట్రంలోనూ అన్నదాతల బలవన్మరణాలు తగ్గడం లేదు. 

సమస్యల వలయంలో..

ఉమ్మడి పాలనలో వేధించిన సమస్యలు ఇప్పుడు లేనప్పటికీ, రైతులకు ఇప్పటి ఇబ్బందులు ఇప్పుడూ ఉన్నాయి. ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో మెజార్టీ రైతులకు బ్యాంకులు పంటరుణాలు ఇవ్వడం లేదు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు అప్పు చేసి పంట సాగు చేస్తున్నారు. వాణిజ్య పంటలైన పత్తి, మిర్చిని సాగు చేస్తున్న రైతులు, చీడపీడలు, వైరస్​లు సోకి పంట నష్టపోతే తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో మాదిరిగా కరెంటు కోతలు లేనప్పటికీ అకాల వర్షాలతో  చేతికి వచ్చిన పంట నీళ్లపాలవుతున్నది. ఇటీవల కాలంలో అకాల వర్షాలతో రాష్ట్రంలో చాలాచోట్ల మిర్చి పంటకు నష్టం జరిగింది. అధిక పెట్టుబడి పెట్టి నిండా మునిగిన మిర్చి రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలతో, కరువు కాటకాలతో పంటకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం అంచనా వేసి కొంతమేర రైతుకు డబ్బు సాయం చేసేది. కానీ రాష్ట్రంలో పంట నష్టపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సహా చాలా రాష్ట్రాలు సొంత పంట బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో పంట బీమా సౌకర్యం లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. విపత్తుల్లో పంట నష్టపోతున్న రైతులు, ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకునేవారు లేక అప్పుల్లో కూరుకుపోతున్నారు. 

పెరిగిన పంట పెట్టుబడి

ఆధునిక కాలంలో వ్యవసాయంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దున్నకాలకు, పంట కోతకు వాడే ట్రాక్టర్లు, కోత యంత్రాలకు ఖర్చు బాగా పెరిగింది. వీటికి తోడు లేబర్ చార్జీలు కూడా బాగా పెరిగాయి. విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఎకరా పొలంలో ఏం పంట సాగు చేసినా, దాని పెట్టుబడి వేల రూపాయల్లో ఉంటున్నది. ఇలా పెట్టుబడి పెరిగింది కానీ దీనికి అనుగుణంగా దిగుబడి మాత్రం పెరగడం లేదు. రెండేండ్ల కిందట ఎకరాకు దాదాపు 10 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తే.. ఈసారి అందులో సగం కూడా రాలేదు. కానీ పెట్టుబడి మాత్రం గతంతో పోలిస్తే బాగా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో పంట పండించిన రైతుకు ఎలాంటి ఫాయిదా ఉండటం లేదు. బయట తెచ్చిన అప్పు మాత్రం రెండింతలు అవుతున్నది. రైతు పరిస్థితి, పంటల దిగుబడి, ఆదాయం రెట్టింపుపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

రైతు బంధు ఇస్తున్నా?

రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం కింద ఏటా ఎకరాకు పదివేల రూపాయలు ఇస్తున్నది. కానీ ఈ ఒక్క పథకం అమలు చేస్తూ.. వ్యవసాయంలో గతంలో ఉన్న ఇతర స్కీమ్​లను నిలిపివేయడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూమి ఉండి వ్యవసాయం చేయనటువంటి రైతులకు కూడా ఈ పథకం కింద డబ్బులు వస్తుంటే.. భూమి లేకుండా కౌలుకు వ్యవసాయం చేసే రైతులకు మాత్రం ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదు. అందుకే రైతు ఆత్మహత్యల్లో కౌలు రైతులు ముందు వరుసలో ఉంటున్నారు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నా, అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు ఆగడం లేదు? అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. రైతుల ఇతర సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

- చింత ఎల్లస్వామి, రీసెర్చ్ స్కాలర్