భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధరణితో ఇబ్బంది పడ్డరు

భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధరణితో ఇబ్బంది పడ్డరు
  • ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం కూడా కబ్జా కావొద్దు
  • రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్
  • తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చిస్తం
  • 33 జిల్లాల తహసీల్దార్లతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ధరణితో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు, ఆసామి కష్టాలు, ఇబ్బందులు పడ్డారని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆ కష్టాలు, ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రైతులు, సామాన్యులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాలన్ని తీసుకొస్తున్నామని.. ఇందుకు సంబంధించిన కసరత్తు చివరి దశకు చేరిందని తెలిపారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసి.. పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు.

హైదరాబాద్ షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఆదివారం 33 జిల్లాల తహసీల్దార్లతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని మరింత వేగం పెరగాలన్నారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి కూడా కబ్జాకు గురి కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ‘‘రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించాలి, వారి సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగులు మరింత పట్టుదలతో సమన్వయంతో పని చేయాలి” అని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు అభివృద్ధి సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, వారికి సంక్షేమ పథకాలను అందించడంలోనూ రెవెన్యూ యంత్రాంగం పాత్ర కీలకమైనదని, అందులో తహసీల్దార్ల పాత్ర అతి ముఖ్యమైనదని చెప్పారు.

‘‘ప్రభుత్వానికి ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుంది. ఈ విభాగం సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరి ప్రభుత్వం కోరుకున్న ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా.. లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు సాధ్యమైనంత వేగంగా సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ ప్రభుత్వం కూడా పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పని చేయాలని చెప్పారు.

తహసీల్దార్ల సమస్యలు తీరుస్తం..

కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తహసీల్దార్ల పై కేసులు నమోదు చేసేలా రాష్ట్ర డీజీ‌‌‌‌పీతో చర్చించి త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఉద్యోగులకు మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.  రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్ లో ట్రైనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు రెగ్యులర్ స్టాఫ్, పదోన్నతులు, కోర్టు ఖర్చులు, అద్దె భవనాలు, అద్దె వాహన బకాయిలతో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలు వాటి వల్ల ప్రజలు ఎదురుకొన్న ఇబ్బందులను ప్రస్తావించిన తహసీల్దార్లు భవిష్యత్తులో ఏ విధంగా చేస్తే బాగుంటుందని మంత్రికి తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ ఐదేండ్లుగా పెండింగ్ లో ఉన్న 300 మంది ఉద్యోగుల మెడికల్ రీయంబర్స్ మెంట్ ఫైళ్లను మంత్రి  క్లియర్ చేశారని వెల్లడించారు. సమావేశంలో మేడ్చల్-మల్కాజ్​గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు  వి.లచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ రాములు, ప్రధాన కార్యదర్శి శ్రీ రమేశ్  తదితరులు పాల్గొన్నారు.