స్టార్టప్​: రైతులకు అండగా.. నట్టి విలేజ్

స్టార్టప్​:  రైతులకు అండగా.. నట్టి విలేజ్

చాలామంది రైతులకు దుక్కి దున్ని.. సాగు చేయడమే తెలుసు. కానీ.. పండించిన పంటను మార్కెట్​ చేసుకోవడం తెలియదు. అందుకే ఎన్నో ఏండ్లుగా రైతు నష్టపోతూనే ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి.. తమ ప్రాంత రైతుల ఆదాయం పెంచేందుకు అమన్​ ‘నట్టి విలేజ్’​ పేరుతో స్టార్టప్​ పెట్టాడు. అంతేకాదు.. రైతులకు ఆర్గానిక్​ ఫార్మింగ్​, పంటను ప్రైమరీగా ప్రాసెస్​ చేయడం లాంటివి నేర్పించాడు. దాంతో ఇప్పుడు రైతుల ఆదాయాలు రెట్టింపయ్యాయి. పైగా ఈ స్టార్టప్​ వల్ల ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధి దొరికింది. 

మనదేశంలో సారవంతమైన నేలలు ఉన్నప్పటికీ కావాల్సిన వనరులు లేక రైతులు ఎన్నో ఏండ్లుగా నష్టాలు చూస్తున్నారు. అలాంటి వాళ్ల కష్టాలు ఎలాగైనా తీర్చాలని అమన్ కుమార్ ఒక ఐడియాతో రైతుల దగ్గరకు వెళ్లాడు. ఆ ఒక్క ఐడియా వల్ల రైతులే కాదు.. అతనూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. 

అమన్ ఉత్తర ప్రదేశ్​లోని ఉన్నావ్​ అనే గ్రామంలో పుట్టాడు. 2016లో కంప్యూటర్ అప్లికేషన్స్​లో డిగ్రీ చేశాడు. తర్వాత ఫ్రీలాన్స్ వెబ్ డిజైన్, డెవలప్​మెంట్​ ప్రాజెక్టులు చేయడం మొదలుపెట్టాడు. కానీ.. కొన్నాళ్లకు మళ్లీ చదువుకోవాలని డిసైడ్​ అయ్యాడు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్​)లో ‘సోషల్ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్’ ప్రోగ్రామ్‌‌‌‌లో చేరాడు. అక్కడ చదువుతున్నప్పుడు అమన్ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. 

సోషల్​ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్​, గ్రామీణ రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు.  ఆ తర్వాత అతని స్వస్థలం ఉన్నావ్‌‌‌‌లో పరిస్థితుల మీద స్టడీ చేశాడు. అప్పుడే అతను రైతుల కోసం ఏదైనా చేయాలని డిసైడ్​ అయ్యాడు. అలా పుట్టిందే ‘నట్టి విలేజ్’ అనే స్టార్టప్​. లోకల్​ రైతులకు సాధికారత కల్పించడానికి, వినియోగదారులకు హై – క్వాలిటీ పల్లీ ఉత్పత్తులు అందించడానికి ఇది పనిచేస్తోంది.

అలా మొదలైంది

అమన్​ టీఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే  2018లో స్టార్టప్​ రంగంలోకి దిగాడు. ‘ఫ్రెష్–ఇలీ’ పేరుతో వ్యవసాయ ఉత్పత్తులను ఫామ్​ నుంచి హోమ్‌‌‌‌కి డెలివరీ చేసే సర్వీస్​ మొదలుపెట్టాడు. కస్టమర్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో ఆర్డర్​ పెట్టుకున్న వ్యవసాయ ఉత్పత్తులను  అమన్ స్థానిక రైతులు, మార్కెట్లలో కొని డెలివరీ చేసేవాడు. “ఈ బిజినెస్​ కోసం సొంతంగా వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ డిజైన్​ చేసుకున్నా. 

వ్యాపారం చేయడానికి నాకు పెట్టుబడి, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అవసరం కూడా రాలేదు. కస్టమర్లు ముందు రోజు రాత్రి డబ్బులు చెల్లించేవాళ్లు. అదే డబ్బుతో మరుసటి రోజు రైతుల నుంచి ప్రొడక్ట్స్‌‌‌‌ కొనేవాడిని” అని చెప్పుకొచ్చాడు అమన్​. కానీ.. పెద్ద మార్కెట్ ప్లేయర్స్​ నుంచి పోటీ పెరగడంతో బిజినెస్​ని మూసేశాడు. ఆ తర్వాత అమన్ ఫ్యామిలీ సాయంతో కోల్డ్ ప్రెస్​ మెషిన్‌‌‌‌ వాడి తీసిన ఫ్రెష్​ జ్యూస్​ అమ్మడం, తక్కువ విస్తీర్ణంలో హైడ్రోపోనిక్ ఫార్మింగ్​ లాంటివి చేశాడు. అవి కూడా అంతగా సక్సెస్​ కాలేదు. 

రీసెర్చ్​

అమన్​ మహారాష్ట్రలో ఇంటర్న్‌‌‌‌షిప్ చేస్తున్నప్పుడు వ్యవసాయ రంగాన్ని పీడిస్తున్న సమస్యలపై రీసెర్చ్​ చేశాడు. ఆ తర్వాత అతనితోపాటు నట్టి విలేజ్ కో ఫౌండర్​ సుశాంత్ బెర్మా ఉన్నావ్‌‌‌‌లో పల్లీలు బాగా పండుతుండడం గమనించారు. పల్లీ సాగు విధానం, మార్కెటింగ్​ మీద లోతుగా రీసెర్చ్ చేశారు. అప్పుడు వాళ్లకు తెలిసింది ఏంటంటే.. ఉన్నావ్‌‌‌‌లో పల్లీ బాగా పండుతుంది. కానీ.. రైతులు వాటిని మార్కెట్​ చేసుకోలేకపోతున్నారు. 

ఒక్కోసారి కిలో పల్లీని కేవలం రూ.30 నుంచి రూ.40కే అమ్ముకోవలసి వస్తోంది. అప్పుడు అమన్​ వాటిని ప్రైమరీ ప్రాసెసింగ్‌‌‌‌ చేసి అమ్మితే చాలా ఎక్కువ ధర పలుకుతుందని తెలుసుకున్నాడు. షెల్లింగ్, గ్రేడింగ్ లాంటివి చేస్తే.. 50–60 శాతం ధర పెరుగుతుందని రైతులకు అర్థమయ్యేలా చెప్పాడు. 

ఆ తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్‌‌‌‌ కోసం ప్రొడ్యూసర్​ గ్రూప్​ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. అతని దగ్గర డబ్బు లేదు. దాంతో.. సాయం  కోరుతూ.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్​కి ఒక ప్రతిపాదన పంపాడు. దాంతో ప్రభుత్వం షెల్లింగ్, సోర్టింగ్​, గ్రేడింగ్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికి గ్రాంట్‌‌‌‌ను అందించింది. అలా వచ్చిన డబ్బుతో రైతులు ప్రైమరీ ప్రాసెసింగ్​ ప్లాంట్​లను ఏర్పాటు చేసుకున్నారు.

నట్టి విలేజ్​గా..

రైతులు 2020లో ప్రాసెసింగ్​ ప్లాంట్లు పెట్టారు. ఆ తర్వాత ​​ 2022లో అమన్​ ‘నట్టి విలేజ్‌‌‌‌’ పేరుతో స్టార్టప్​ పెట్టాడు. రైతులను మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించాడు. రైతులు తమ యూనిట్లలో ప్రైమరీగా ప్రాసెస్​ చేసిన పల్లీలను అమన్​ కిలోకు రూ. 100 నుంచి రూ. 120 చొప్పున చెల్లించి కొంటాడు. అంటే అక్కడి రైతులు గతంలో అమ్మిన ధర కంటే ఇది చాలా ఎక్కువ. రైతులు ప్రాసెసింగ్​ చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ప్రాసెసింగ్​ చేసిన తర్వాత బెస్ట్ క్వాలిటీ విత్తనాలను రాబోయే సీజన్‌‌‌‌లో నాటేందుకు దాచుకుంటున్నారు. దానివల్ల ప్రతి సంవత్సరం విత్తనాలు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. 

పట్టణ ప్రాంతాల్లో శుభ్రమైన, క్వాలిటీ పీనట్​ బటర్​కు చాలా డిమాండ్​ ఉంది. అందుకే పల్లీలతో బటర్​ తయారుచేయాలని నిర్ణయించుకున్నా. దీనివల్ల నాతో పాటు మా ఊరి రైతులు కూడా లాభపడతారు అనిపించింది. కొన్ని నెలలపాటు ప్రయోగాలు చేసి చివరకు ఆరోగ్యకరమైన పీనట్​ బటర్​ తయారుచేశాం” అంటూ తన జర్నీని చెప్పుకొచ్చాడు అమన్​. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్, టీఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌లో ప్రొఫెసర్​గా పనిచేస్తున్న అనూజ్ శర్మ  ఇచ్చిన రూ.1.5 లక్షలతో మెషినరీ కొని అమన్ బటర్​ ప్రొడక్షన్​ మొదలుపెట్టాడు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌‌‌‌ ద్వారా స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు ట్రైనింగ్​ ఇప్పించి వాళ్లను కూడా ప్రొడక్షన్​లో భాగం చేశాడు. 

ఆర్గానిక్​.. 

‘‘మేమంతా కలిసి లాభాల కోసం ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్నప్పుడే అమన్‌‌‌‌ కలిశాడు. అతను మాకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చాడు. ఆ తర్వాత మంచి వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పాడు” అన్నాడు ఉన్నావ్‌‌‌‌కు చెందిన 36 ఏళ్ల రైతు మనీష్ సింగ్​. అమన్ చెప్పాకే అక్కడివాళ్లు నేల pH, నైట్రోజన్ ఫాస్ఫేట్, కార్బన్ లెవెల్స్​ టెస్ట్‌‌‌‌ చేయించారు. ఆ తర్వాత అమన్ వాళ్లకు సేంద్రియ వ్యవసాయం, వేస్ట్ మేనేజ్​మెంట్​, బయో-ఎరువుల ఉత్పత్తి.. ఇలా అనేక విషయాలు చెప్పాడు. సైంటిస్ట్‌‌‌‌ డాక్టర్ కిషన్ చంద్ర ద్వారా రైతులకు  అవగాహన కల్పించాడు. దాంతో చాలామంది ఆర్గానిక్​ పద్ధతుల్లో పండించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దిగుబడి పెరగడమే కాకుండా..  నేల pH 8.5 నుంచి 7.5కి తగ్గింది. 

ఎన్నో సవాళ్లు 

ఈ ప్రయాణంలో అమన్​కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డాడు. మొదట్లో రైతులను కొత్త వ్యవసాయ పద్ధతులు పాటించేలా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత రైతులు ఏర్పాటు చేసుకున్న ప్రాసెసింగ్​ యూనిట్లకు కరెంట్ కనెక్షన్​ తీసుకోవడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే.. కరెంట్​ కనెక్షన్, లైసెన్స్ పొందడం చాలా పెద్ద ప్రాసెస్​. పైగా రూ. 60 వేల రూపాయలు ఖర్చవుతుంది. 

కానీ.. అంత డబ్బు  రైతుల దగ్గర లేదు. అందుకోసం ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చేవరకు ఏడు నుండి ఎనిమిది నెలలు వేచి చూడాల్సి వచ్చింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నట్టి విలేజ్ సక్సెస్​ అయ్యింది. 2022లో రూ. 60 వేలు మాత్రమే ఆదాయం వచ్చింది. 2023లో అది రూ. 2.5 లక్షలకు పెరిగింది. కానీ.. పోయినేడు ఏకంగా రూ. 13 లక్షల వరకు సంపాదించాడు అమన్‌‌‌‌. ప్రస్తుతం 50 మంది రైతులు నట్టి విలేజ్​తో కలిసి పనిచేస్తున్నారు. 2,000 మంది రైతులను ఏకం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అమన్​.