డోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లైన్ నిర్మాణంపై రైతుల్లో టెన్షన్

ఖమ్మం, వెలుగు:మహబూబాబాద్​జిల్లా డోర్నకల్ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వరకు రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియ ఖమ్మం జిల్లా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ లైన్ నిర్మాణం కోసం మూడు మండలాల్లో ఓ ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ట్రాక్ నిర్మాణానికి భూసేకరణ కోసం చేస్తున్న సర్వే ఏజెన్సీ సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు. దీంతో రైల్వే లైన్  కోసం భూమి కోల్పోవాల్సి వస్తుందని రైతులు టెన్షన్​ పడుతున్నారు. ప్రధానంగా ఈ లైన్​కోసం ప్లాన్​చేసిన రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాలు ఖమ్మం నగరానికి అత్యంత సమీపంలో ఉంటాయి. వీటిలోని చాలా గ్రామాలు స్తంభాద్రి అర్బన్​డెవలప్ మెంట్అథారిటీ(సుడా) పరిధిలో ఉన్నాయి. రియల్​ఎస్టేట్​వ్యాపారుల కారణంగా భూముల ధరకు రెక్కలొచ్చి, ఎకరాకు రూ.3 కోట్లకు పైగా పలుకుతున్న దాఖలాలు ఉన్నాయి. అలాంటి భూములను రైల్వే లైన్​కోసం తీసుకుంటే తమకు పరిహారం తక్కువగా వస్తుందని కొందరు భయపడుతుండగా, లైన్​ నిర్మాణం తర్వాత దాని సమీపంలో ఉన్న భూముల విలువ కూడా తగ్గుతుందని మరికొందరు టెన్షన్ ​పడుతున్నారు. 

ఇండస్ట్రీలకు బొగ్గు తరలించేందుకు..

మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ప్రధానంగా గ్రానైట్​ఇండస్ట్రీ ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా గ్రానైట్ రాళ్లను ఎగుమతి చేస్తారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రైస్​ఇండస్ట్రీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆసియాలోనే అత్యంత ఎక్కువ రైస్​మిల్లులున్న ప్రాంతంగా మిర్యాలగూడకు పేరుంది. ఇక హుజూర్ నగర్​ నియోజకవర్గంలో సిమెంట్ కంపెనీలున్నాయి. వీటి నుంచి సిమెంట్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు నుంచి సిమెంట్ పరిశ్రమలకు అవసరమైన బొగ్గును తరలించేందుకు వెరసి ఈ రైల్వే లైన్​ప్రధాన ఉద్దేశం. ఏళ్లుగా ఈ రైల్వే లైన్​ప్రపోజల్ఉండగా, గతేడాది రైల్వే శాఖ నుంచి గ్రీన్​సిగ్నల్ వచ్చింది. రూ.1294.12 కోట్లతో 120 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో తుది దశ సర్వే కోసం గతేడాది చివర్లో రూ.3 కోట్లు విడుదల చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి, కామంచికల్లు, రామన్నపేట, గోళ్లపాడు, పోలేపల్లి, పల్లెగూడెం, రెడ్డిపల్లి, ముత్తగూడెం, ఏదులాపురం, మద్దులపల్లి, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, వెంకటగిరి, గువ్వలగూడెం, నేలకొండపల్లి, రామచంద్రాపురం, కోదాడ, హుజూర్ నగర్, ఎర్రగుట్ట, వరదాపురం, జాన్​పహాడ్ మీదుగా మిర్యాలగూడ వరకు సర్వే చేస్తున్నారు. 

నాలుగేళ్లలో పూర్తి చేసేలా...

మొత్తం రైల్వే లైన్ లో రెండు జంక్షన్లు, 8 క్రాసింగ్ లు, నేలకొండపల్లి, కోదాడ, హుజూర్ నగర్ లో హాల్టింగ్ ఉండనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ఈ రైల్వే లైన్ ప్లాన్​చేసినట్టు తెలుస్తోంది. దీనికి 298 హెక్టార్లు(745 ఎకరాలు) భూ సేకరణ అవసరం ఉంటుందని అంచనా వేశారు. గ్రానైట్, సిమెంట్ ఇండస్ట్రీలతోపాటు రైస్ మిల్లర్లకు అనుకూలంగా ఉండే ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ధాన్యం, సిమెంట్, గ్రానైట్, ఫెర్టిలైజర్స్, బొగ్గు సరఫరాకు వీలుకానుంది. మొత్తం11స్టేషన్లను కలుపుతూ నిర్మాణమయ్యే ఈ లైన్​ లో రెండు కొత్త రైల్వే స్టేషన్లు ఉంటాయని సమాచారం. ఈ లైన్ నిర్మాణం పూర్తయితే దీని ద్వారా పెట్టిన ఖర్చు మొత్తానికి వచ్చే ఆదాయం(రేట్ ఆఫ్​రిటర్న్ రేషియో)15.69శాతంగా ఉందని ఆఫీసర్లు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. అయితే సర్వే చేస్తున్న సిబ్బందిని చూసిన రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో మార్కింగ్ చేస్తుండడంపై అభ్యంతరం చెబుతున్నారు. ఇటీవల ఖమ్మం రూరల్​మండలం ముత్తగూడెం, ఏదులాపురంల సమీపంలో సర్వే చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. తమ పొలాలు, నివాసాల నుంచి లైన్​వేస్తారా అంటూ నిలిపేశారు. మిగిలిన మండలాల్లోనూ రైతులు టెన్షన్ పడుతున్నారు. 

బంగారంలాంటి భూమి తీసుకుంటరట..

మేడేపల్లి రెవెన్యూలో సర్వే నెంబరు11/ఆ2లో మూడెకరాల భూమి ఏడాదికి మాకు రెండు పంటలు పండుతయ్​. ఆ భూమిమీదే కుటుంబం ఆధార పడినం. బంగారంలాంటి భూమి మధ్యలో నుంచి రైలు వెళుతుందని సర్వే చేసి గుర్తులు వేసిండ్రు. ఇదే జరిగితే మా భూమి విలువ తగ్గిపోతది. మా భూమి పక్కనే హైవే వచ్చి అక్కడ భూ ముల ధరలు పెరిగినయి. రైల్వే లైన్ తో వస్తే పడిపోతయి. తరతరాలుగా వస్తున్న భూమిని రైల్వే లైన్ తో లాక్కుంటరని భయమైతుంది.

–అయినాల రాకేశ్, వెంకటాపురం, ముదిగొండ మండలం