- కాళేశ్వరం కాలువ కింద ఆరుతడి పంటల సాగు
- కాలువలో ఊరే నీటి కోసం పొద్దు.. మాపు పడిగాపులు..
- పదేండ్లు దాటినా కాళేశ్వరం -22 ప్యాకేజీ పనులు ఏడియాడనే..
- పనులు పూర్తి చేసి సాగునీరివ్వాలని రైతుల డిమాండ్
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో యాసంగి పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కాలువలపై ఆధారపడి వేసిన మక్క చేన్లను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. కాళేశ్వరం కాలువలో ఊరే నీళ్ల కోసం రాత్రి పగలు తేడా లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ఊరే నీటిని మక్క చేలకు పారించేందుకు మోటార్, జనరేటర్ల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా చేన్లకు నీటి తడులందక పొట్టకొచ్చే దశలో మక్క చేన్లు ఎండిపోతున్నాయి.కొందరు చేసేదేమీ లేక కొట్టేసి పశువులకు మేతగా వేస్తున్నారు.
జిల్లాకు సాగునీటి వనరులు నిల్..
జిల్లాలో 5 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నా.. సాగునీటి వనరులు లేవు. నిజాంసాగర్ ప్రాజెక్టుతో కామారెడ్డి జిల్లాలోని 2 మండలాలకు మినహా మిగతా ప్రాంతాలకు సాగు నీళ్లు రావు. పోచారం ప్రాజెక్టుతో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని 10 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల్లో పూర్తిగా, బాన్స్వాడ నియోజక వర్గంలో కొంత భాగం ఏరియాలో పంటలకు బోర్లే ఆధారం. అందుకే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలతో పాటు, బాన్స్వాడలో కొంత ఏరియా, మెదక్ జిల్లా రామాయం పేట మండలానికి మొత్తం 2.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రాణహిత -చేవెళ్ల ( ప్రస్తుతం కాళేశ్వరం) ప్రాజెక్టు పనుల్లో భాగంగా 22వ ప్యాకేజీ ప్రతిపాదించారు.
కెనాల్ పనుల పెండింగ్వల్లనే..
అప్పుడే పనులు కాలువ పనులు ప్రారంభించి కొంత మేర పూర్తి చేశారు. మెయిన్ కెనాల్‌తో పాటు, సొరంగ మార్గం, రైట్, లెప్ట్ కెనాల్స్పనులు బాగానే జరిగాయి. సదాశివనగర్ మండలం భూంపల్లి వద్ద రిజర్వాయర్ పనులు కొంత వరకు చేశారు. 8 ఏండ్లుగా కెనాల్పనులను పట్టించుకునే నాథుడే లేడు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా రూ.1,446 కోట్లకు గాను ఫండ్స్‌లో కేటాయింపులు చేయనేలేదు. మెయిన్ కెనాల్స్, లింక్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, రిజర్వాయర్ల నిర్మాణానికి 4,422 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, 1,244 ఎకరాలు మాత్రమే సేకరించారు.
కాలువలో తగ్గిపోతున్న నీళ్లు..
సదాశివనగర్ మండలం ఉత్తునూర్ శివారు నుంచి గాంధారి మండలం కరక్‌వాడి మీదుగా తవ్విన కాళేశ్వరం -22 ప్యాకేజీ కాల్వ వెంట పలువురు రైతులు మక్క పంట సాగు చేశారు. వారం రోజులుగా ఎండ తీవ్రత పెరగడం, కాలువకు మోటార్లు ఎక్కువ కావడంతో నీళ్లు తగ్గిపోతున్నాయి. దీంతో ఊరే నీటి కోసం రైతులు పొద్దూ మాపు పడిగాపులు కాస్తున్నారు. ఊటగా వచ్చే నీళ్లతో కొంత ఏరియా కూడా నీళ్లు పారడం లేదు. పంపు మోటార్లు, పైపులు, జనరేటర్ల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసినా నీటి తడులందక మక్క పంట ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం కాలువ పనులు త్వరగా పూర్తి చేసి జిల్లా కు సాగునీరందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బోరు ఫెయిలై.. కాల్వకు మోటారు..
2 ఎకరాల మక్క పంట వేసిన. ఇటీవల 700 వరకు బోరు తవ్వించినా నీళ్లు రాలే. పక్క నుంచే కాల్వ పోతుండడంతో మక్క చేనుకు కాల్వ నీళ్లు పారించేందుకు కరెంట్కనెక్షన్లేకున్నా.. రూ.20 వేలు పెట్టి చిన్న జనరేటర్, పంపు కొనుకొచ్చిన. రైతులందరూ కాల్వనీళ్లపై పడడంతో మక్క చేనును కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నా..
– కొత్తగారి రాములు, ఉత్తునూరు
తడులందక మక్కచేను కొట్టేస్తున్నా
కాల్వలో నీళ్లున్నయని 4 ఎకరాల్లో మక్క వేసిన. వారం రోజులుగా ఎండలు పెరగడంతో నీళ్లు ఇంకిపోతున్నాయి. ఊరే నీళ్ల కోసం రైతులందరం ఎదురు చూస్తున్నం. చేనుకు తడులందక కంకి వచ్చే దశలో ఎండిపోతోంది. చేసేదేమి లేక కొట్టేసి పశువులకు మేతగా వేస్తున్న.
– భూపెల్లి భూమయ్య, ఉత్తునూర్