కేంద్రానికి తేల్చి చెప్పిన రైతు సంఘాలు
ప్రతిపాదనలకు ఒప్పుకోబోమని వెల్లడి
కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని రైతు సంఘాలు తేల్చిచెప్పాయి. ఎలాంటి సవరణలకు ఒప్పుకునేది లేదని స్పష్టంచేశాయి. చట్టాలను సవరిస్తామని, కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. మరోవైపు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 12 న దేశంలోని అన్ని టోల్గేట్లను ముట్టడిస్తామని చెప్పారు. 14 న దేశవ్యాప్తంగా ధర్నా చేస్తామని వివరించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలన్నదే తమ డిమాండ్ అని రైతు సంఘాల నేతలు మరోసారి తేల్చిచెప్పారు. ఈ చట్టాలకు ఎలాంటి సవరణలు చేసినా అంగీకరించేదిలేదని స్పష్టంచేశారు. చట్టాలను సవరిస్తామని, కనీస మద్దతు ధరను కొనసాగిస్తామని లిఖితపూర్వక హామీ ఇస్తామని కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం చేసిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ఈ క్రమంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. గురువారం రైతు సంఘాల నేతలతో మరోసారి చర్చలు జరుపుతామని ప్రభుత్వం తెలపగా.. ఇకపై చర్చలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా ప్రపోజల్స్ నేపథ్యంలో ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 12 న దేశంలోని అన్ని టోల్గేట్లను ముట్టడిస్తామని చెప్పారు. 14 న దేశవ్యాప్తంగా ధర్నా చేస్తామని వివరించారు. ఢిల్లీ బార్డర్లలో నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది రైతులు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు.
మార్పులు చేస్తం..
కొత్త చట్టాలపై రైతుల ఆందోళనల నేపథ్యంలో అవసరమైన మార్పులు చేయడానికి సిద్ధమని కేంద్రం ప్రకటించింది. చట్టాలలో కనీసం ఏడు అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు కూడా చేసింది. మండీల విషయంలో రైతుల భయాందోళనలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈమేరకు ఆందోళన చేస్తున్న 13 రైతు సంఘాలకు వ్యవసాయ శాఖ డ్రాఫ్ట్ పంపించింది. చట్టాలపై రైతులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు వివరణ ఇచ్చేందుకు, మార్పులకు సిద్ధమని ప్రకటించింది. ఆందోళనలు ఆపాలని రైతులను కోరింది. అయితే, రైతుల ప్రధాన డిమాండ్ అగ్రి చట్టాల రద్దు విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో.. ప్రభుత్వ ప్రతిపాదనలలో కొత్త అంశాలేమీ లేవని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తమ ఆందోళన కొనసాగిస్తామని బుధవారం ప్రకటించారు. ఆందోళన చేస్తున్న రైతు సంఘాల లీడర్లతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
కొత్త చట్టాలతో మండీలు బలహీనం అవుతాయి..
ప్రతిపాదన: మండీలు ఉంటయ్.. రైతుల అనుమానాలను తొలగించేలా అవసరమైన మార్పులు.. ప్రైవేటు ట్రేడర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీంతో పాటు మండీల తరహాలోనే వారిపైనా టాక్స్విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించడం.
ట్రేడర్లపై కంట్రోల్ ఉండదు..
ప్రతిపాదన: ప్రైవేట్ ట్రేడర్లపై నియంత్రణ కోసం స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా అవసరమైన రూల్స్ ఏర్పాటు అధికారాన్ని రాష్ట్రాలకు కట్టబెట్టడం.
కనీస మద్దతు ధర ఎత్తేస్తరు..
ప్రతిపాదన: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని కొత్త చట్టాల్లో టచ్ చేయలేదు. ఇకపైనా ఎంఎస్పీ ఉంటది. దీనిపై లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు రెడీ.
రైతుల భూములు కార్పొరేట్ల చేతుల్లోకి..
ప్రతిపాదన: సాగు భూములు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి పోతయనేది కరెక్ట్ కాదు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అయినా మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొనుగోలు దారులు సాగు భూమిపై లోన్లు తీసుకునేందుకు వీల్లేదు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్‌పై..
ప్రతిపాదన: సాగు భూములను కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం అటాచ్ చేసే విషయంలో ఇప్పటికే చట్టాల్లో స్పష్టమైన వివరణ ఉంది..
కరెంట్ బిల్లులు..
ప్రతిపాదన: రైతుల కరెంట్ బిల్లులకు సంబంధించి ఇప్పు డున్న వ్యవస్థే ఇకపైనా కొనసా గుతుంది. అందులో ఎలాంటి మార్పులు చేయబోవడంలేదు. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020తో ఈ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలగదు.
పంట వ్యర్థాలను కాల్చేస్తే ఫైన్..
ప్రతిపాదన: పంట వ్యర్థాల కాల్చివేతకు పెనాల్టీ విధించేందుకు వీలు కల్పించే ఎన్సీఆర్ ఆర్డినెన్స్2020 ను రద్దు చేయాలన్న డిమాండ్ పై.. దీనికి సంబంధించి తగిన పరిష్కార మార్గం కనుగొంటామ ని కేంద్రం వివరణ.
వివాదాల పరిష్కారం ఎట్లా..
ప్రతిపాదన: వివాదాల పరిష్కారానికి సివిల్ కోర్టులను ఆశ్రయించేలా రైతులకు వీలు కల్పించడం.. పంట ఉత్పత్తి, మార్కెట్ కమిటీ చట్ట సవరణకు రెడీ.