- కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పురుగుల్లా చూస్తోంది
- పాలేరు నుంచే పోటీ చేస్త..
- అపోహలు వద్దు: వైఎస్ఆర్టీపీ చీఫ్షర్మిల
ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో రైతులకు భరోసా లేకుండా పోయిందని వైఎస్ఆర్టీపీ చీఫ్షర్మిల విమర్శించారు. అకాల వర్షాలకు తడిసి మొలకలు వస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో సోమవారం ఆమె పర్యటించారు. ఖమ్మం రూరల్‌మండలం సాయిగణేశ్నగర్లోని పార్టీ ఆఫీసులో కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేశారు. అనంతరం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలతో వెళ్తున్నాయన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తే బీఆర్ఎస్ప్రభుత్వం కనీసం గౌరవం ఇవ్వలేదన్నారు. ఆర్టీసీలో సంఘమే లేకుండా చేశారని, విద్యుత్ శాఖ కార్మికులు సమ్మెకు దిగితే విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. కార్మికులను కేసీఆర్ పురుగుల్లా చూస్తున్నారని, ప్రజలు, కార్మికులు ఆయన కింద బానిసల్లా బతకాలా అని ప్రశ్నించారు. కార్మిక చట్టాల ప్రకారం కనీస జీతం రూ.26 వేలు ఉండాలని, 10 వేలు జీతం లేని కార్మికులు ఎంతో మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది కాంట్రాక్ట్ బేసిస్మీద పని చేస్తుంటే, కేవలం 5 వేల మందిని రెగ్యులర్ చేస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని, ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. తెట్టెలపాడులో పాడైన మక్క పంటను, కిష్టాపురంలో రోడ్లపై ఆరబోసిన వడ్లను, కూసుమంచి ఐకేపీ సెంటర్పరిశీలించేందుకు వచ్చిన షర్మిలతో రైతులు తమ గోడను వెల్లబోసుకున్నారు. 10 రోజులుగా ఎదురుచూస్తున్నా వడ్లు కొనడం లేదని వాపోయారు. తడిసిన వడ్లకు క్వింటాల్‌కు 8 నుంచి 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రోడ్డుపై చూసినా ఆరబోసిన వడ్లే కనిపిస్తున్నాయన్నారు. రైతుబంధు రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా, పండిన పంట కొనే బాధ్యత లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 7 వేల కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రులు గొప్పలు చెబుతున్నారని, కనీసం -2 వేల కేంద్రాలు కూడా తెరవలేదని ఆరోపించారు. 56 లక్షల ఎకరాల్లో కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే, ఇప్పటి వరకు కొన్నది కేవలం 5 లక్షల మెట్రిక్ టన్నులేనని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో కేవలం 15 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో -కేసీఆర్ రైతుల ఆగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పారు. ఆమె వెంట వైఎస్ ఆర్టీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి గడిపల్లి కవిత, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.