యాదగిరిగుట్ట, కొండమల్లేపల్లి, కట్టంగూర్( నకిరేకల్ ), వెలుగు : రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యానించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా సమాధి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. బుధవారం బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలోని రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 3 గంటల విద్యుత్ అంటున్న కాంగ్రెస్ కావాలో, మూడు పంటలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాలో..? రైతులు తేల్చుకోవాలన్నారు.
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఏజెంట్ అని ఆరోపించారు. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకలలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, కట్టంగూర్‌లో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. రేవంత్ కామెంట్లు చూస్తే కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే ఉచిత విద్యుత్ ఉండదని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.