కోరుట్ల, వెలుగు : రైతుల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్సీ, నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి చెప్పారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని, వడ్లకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి రత్నాకర్‌రావు ఫిల్టర్ బెడ్ నిర్మిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో వదిలేసి, మిషన్ భగీరథ పేర మురుగు నీరు సప్లై చేసిందని ఆరోపించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఫిల్టర్ బెడ్ నిర్మాణం పూర్తి చేసి స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తామని చెప్పారు. ఖరీఫ్‌లో వరికి రూ. 500 బోనస్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫ్రీ బస్, ఫ్రీ విద్యుత్, రైతులకు మద్దతు ధర వంటి పథకాలు అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎలాంటి కటాఫ్ లేకుండా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని, చనిపోయిన గల్ఫ్ కార్మికులకు రూ.5 లక్షలు, సంక్షేమ బోర్డు, ఉచిత విద్య, వైద్యం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ అర్వింద్ గత ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, పసుపు బోర్డు, చక్కెర పరిశ్రమ హామీ ఏమైందని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే ముత్యంపేట, బోధన్ చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పారు. కరీంనగర్ నుంచి నడిచే తిరుపతి రైలును నిజామాబాద్ నుంచి లింక్ చేసి పొడిగించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు గంధం గంగాధర్, గుండోజి శ్రీనివాస్, పుప్పాల ఉమాదేవి-ప్రభాకర్, సింగిల్ విండో చైర్మన్ ఎలిశెట్టి భూమారెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణారావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ పెద్దెల్లి ప్రకాశ్ పాల్గొన్నారు.