- కానరాని పుప్పొడి తాలుగా మారుతున్న గొలుసులు
హనుమకొండ, ఎల్కతుర్తి, వెలుగు: ప్రైవేట్ విత్తనోత్పత్తి కంపెనీల హైబ్రీడ్ (మేల్, ఫీమేల్) రకాల వరి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఇప్పటికే పొలాలు పాలినేషన్ దశకు చేరగా.. ఇప్పటికీ పుప్పొడి రావడం లేదు. పాలినేషన్ జరగక గొలుసు తాలుగా మారిపోతోంది. దీంతో దిగుబడిపై పడే అవకాశం ఉంది.
స్పందించని కంపెనీలు
ఇదిలాఉంటే విత్తనాలు అందజేసే కంపెనీలు గతంలో రైతులతో పంట లాభనష్టాలు, దిగుబడి విషయంలో ఒప్పందం కుదుర్చుకుని బాండ్లు రాసిచ్చేవి. కానీ ఇటీవల కాలంలో ఏ కంపెనీ రైతులకు బాండ్లు ఇవ్వడం లేదు. దీంతో ఒకవేళ పంట దిగుబడి రాకపోతే అన్నదాతలు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
2 లక్షల ఎకరాలకు పైగా..
మేల్, ఫీమేల్ రకాలను రాష్ట్రంలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అందులో ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోనే అత్యధికంగా లక్ష ఎకరాల వరకు పండిస్తున్నారు. బేయర్, సిన్‌జెంటా, పాయనీర్, కావేరి, సుప్రీంతోపాటు మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు అందిస్తున్నాయి. సాగుకు కావాల్సిన సలహాలు, సూచనలు, అన్ని రకాల మందులు కూడా ఇస్తున్నాయి. సాగు తరువాత పంటను క్వింటాకు రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు ధర చెల్లిస్తూ దిగుబడులను కొనుగోలు చేస్తున్నాయి. సాధారణ వరితో పోలిస్తే మేల్, ఫీమేల్ సాగులో ఖర్చులు, శ్రమ అధికంగా ఉంటున్నప్పటికీ.. అదే స్థాయిలో లాభాలు కూడా వచ్చే అవకాశం ఉండటంతో రైతులు ఈ హైబ్రీడ్ రకాలను సాగు చేయడానికి ఆసక్తి చూపారు.
పాలినేషన్ జరగక ఇబ్బందులు
మేల్, ఫీమేల్ వరి సాగులో పాలినేషన్ కీలకం. మగ వరి గొలుసు నుంచి వచ్చే పుప్పొడిని ఆడ వరిపై పడేలా చేయడం ద్వారా గింజ పాలు పోసుకుంటుంది. తరువాత కంపెనీ ప్రతినిధులు కేవలం ఆడ వడ్లను మాత్రమే కొనుగోలు చేస్తుండగా.. మగ వడ్లను రైతులు విక్రయిస్తుంటారు. ఇదంతా సాగు ప్రాసెస్ కాగా తాజా వాతావరణ పరిస్థితులు మేల్, ఫీమేల్ సాగుకు అవరోధాన్ని కలిగిస్తున్నాయి. పాలినేషన్ సరైన టైంకు జరుగకపోవడంతో .. నాణ్యత తగ్గి విత్తనాల్లో మొలక శాతం తగ్గుతుంది. కానీ వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో కూడా హెచ్చుతగ్గుల వల్ల మగ వరి గొలుసు నుంచి పుప్పొడి రావడం లేదు. ఫలితంగా పాలినేషన్ జరగక ఆడ వరి గొలుసు తాలుగా మారిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విత్తన కంపెనీల మాయాజాలం
వాతావరణ పరిస్థితులతో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న రైతులను హైబ్రీడ్ వరి విత్తన కంపెనీలు కూడా నట్టేట ముంచుతున్నాయి. ఇదివరకు మేల్, ఫీమేల్ వరి సాగు చేసే రైతులతో విత్తన కంపెనీలు ఒప్పందం కుదుర్చుకునేవి. సరైన దిగుబడి రాకపోతే.. పంటకు డబ్బులు తిరిగి ఇచ్చేలా బాండ్ రాసుకునేవారు. కంపెనీ నిబంధనలు చెప్పి, రైతులతో సంతకాలు తీసుకునేవారు. ఆ తరువాత వాతావరణం సహకరించక పంట దిగుబడి తగ్గిపోతే విత్తనాలు, పురుగు మందుల డబ్బులు మినహాయించి ఎంతోకొంత డబ్బులు ముట్టజెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు.
ఎలాంటి ఒప్పందం లేకుండానే కంపెనీల ఆర్గనైజర్లు రైతులతో హైబ్రీడ్ రకాలు సాగు చేయిస్తున్నారు. పంట దిగుబడి వస్తే ఓకే.. లేదంటే తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఓ వైపు వాతావరణంలో మార్పులతో మేల్, ఫిమేల్ సాగు దెబ్బతింటుండగా.. విత్తన కంపెనీలు చేతులెత్తేస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదివరకు కొన్ని కంపెనీల వరి సాగు చేసిన రైతులు ఆర్గనైజర్ల మోసానికి బలైన ఘటనలుండగా.. హైబ్రీడ్ వరి సాగుపై వ్యవసాయ శాఖ వద్ద సరైన సమాచారం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కాగా ఈ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఈ సారి వాతావరణం అనుకూలంగా లేదు
నిరుడు రెండెకరాల్లో ఆడ, మగ వరి వేస్తే ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ఈసారి రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న. కానీ వాతావరణం మారుతుండటం వల్ల పుప్పొడి సరిగా వస్తలేదు. చాలా వరకు గొలుసు తాలుగా మారుతాంది. ఈసారి దిగుబడి ఎట్లుంటదోనని టెన్షన్ గా ఉంది.
పుట్ట స్వామి, సూరారం
బాండ్లు ఇస్తనేలేరు
నేను పదేండ్ల నుంచి మేల్, ఫీమేల్ వరి వేస్తున్న. కొన్ని కంపెనీలు మొదట్ల బాండ్ రాసిచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సిస్టం లేదు. నమ్మకం మీదనే సాగు చేస్తున్నం. పండితే లాభం. లేకుంటే నష్టమే. గతంలో ఓ కంపెనీ వరి సాగు చేస్తే నష్టం వచ్చిందని పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆర్గనైజర్ ఉల్టా నా కొడుకు మీదనే కేసు పెట్టిండు. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి రైతులకు బాండ్లు ఇప్పిస్తే బాగుంటుంది.
నార్లగిరి ఆనందం, వీరనారాయణపూర్