రోడ్ల మీదే టెంట్లు, వంటా వార్పు.. 4 గంటలకు పైగా స్తంభించిపోయిన ట్రాఫిక్
జగిత్యాల / కామారెడ్డి /కామారెడ్డి టౌన్, వెలుగు: జగిత్యాల మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతున్నది. గురువారం జగిత్యాల దిగ్బంధానికి పిలుపునిచ్చిన రైతు జేఏసీ నాయకులు.. ప్రధాన రోడ్లపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రోడ్ల మీదే టెంట్లు వేసి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మాస్టర్ ప్లాన్ వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. అభ్యంతరాలుంటే జోన్లను మారుస్తామని అధికారులు చెప్తున్నారని, దీనివల్ల మరో ఊరిలో రైతులు నష్టపోతారని చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు భూములు కోల్పోకుండా ఎమ్మెల్యే, చైర్ పర్సన్ బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగి వచ్చి మాస్టర్ ప్లాన్ నుంచి గ్రామాలను తొలగిస్తున్నట్లు ప్రకటించాలన్నారు.
రైతు జేఏసీ పిలుపు మేరకు జగిత్యాల మండలం మోతె, తిమ్మాపూర్‌లకు చెందిన రైతులు జగిత్యాల – గొల్లపల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నర్సింగాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామస్తులు, రైతులు గ్రామ సభ నిర్వహించి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. తర్వాత జగిత్యాల,- కరీంనగర్ హైవే పై రాస్తారోకో చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు. అంబారీపేట్, హస్నాబాద్ గ్రామస్తులు జగిత్యాల,- నిజామాబాద్ హైవేపై రాస్తారోకో చేశారు. రోడ్డు మీదే టెంట్లు వేసి వంటవార్పుతో నిరసన తెలిపారు. తమ భూములను ప్రభుత్వం తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆయా గ్రామాల మహిళలు పురుగుల మందు డబ్బాలతో వచ్చారు. పోలీసులు వారి నుంచి డబ్బాలను లాక్కున్నారు. తిప్పన్నపేట్కు చెందిన రైతులు జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. హైవేల దిగ్బంధంతో నాలుగు గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మాస్టర్ ప్లాన్రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని, ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
మంత్రి కొప్పులకు నిరసన సెగ
జగిత్యాలలోని 1వ వార్డులో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించాల్సి ఉండగా.. రైతుల దిగ్బంధంతో ఆయన హాజరుకాలేదు. జగిత్యాలకు బదులు ఆయన ధర్మపురిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
షబ్బీర్‌కు రాజీనామా లేఖలు ఇచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ రైతు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. గురువారం తమ రాజీనామా లేఖలను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్అలీకి అందించారు. పి.జ్ఞానేశ్వరి (31వ వార్డు), పాత శివ కృష్ణమూర్తి (37వ వార్డు) అన్వర్ ఆహ్మద్ (48వ వార్డు), మెహ్రాజ్ మెహెర్ (49వ వార్డు) తమ రాజీనామా లేఖలు ఇచ్చారు.
మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని తీర్మానం చేస్తం: కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కౌన్సిల్ మీటింగ్‌లో తీర్మానం చేస్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి చెప్పారు. శుక్రవారం ప్రత్యేకంగా కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కౌన్సిల్ చేసిన ప్రతిపాదన ప్రకారం కాకుండా.. డీడీఎఫ్ కన్సల్టెన్సీ, డీటీసీపీ ఆఫీసర్లు మాస్టర్ ప్లాన్‌ను మార్చి పంపారని ఆరోపించారు. తాము సూచించిన విధంగా కాకుండా రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ర్టియల్, గ్రీన్ జోన్, రిక్రియేషన్ జోన్లలో మార్పులు చేశారని చెప్పారు. ప్లాన్ మార్చి పంపిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
మున్సిపల్ కమిషనర్‌కు రాజీనామా లెటర్లు ఇచ్చిన బీజేపీ కౌన్సిలర్లు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు తమ రాజీనామా లేఖలు ఇచ్చారు. మున్సిపాల్టీలోని విలీన గ్రామాలకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు సుతారి రవి (2వ వార్డు), కాసర్ల శ్రీనివాస్(11వార్డు).. రైతు జేఏసీ ప్రతినిధులతో కలిసి వచ్చి మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌కు రాజీనామా లేఖలు ఇచ్చారు. ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవటంతో కౌన్సిలర్లు 3 రోజుల కిందటే రైతు జేఏసీ ప్రతినిధులకు రాజీనామా లెటర్లు ఇచ్చారు. వాటిని గురువారం మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. మరోవైపు బీజేపీకి చెందిన ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ తో సహా కౌన్సిలర్లు అవదూత నరేందర్, పండ్ల ప్రవీన్, అనుమాండ్ల మానస, ఆకుల సుజిత ఈనెల 23న రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.