
- పెండింగ్ పరిహారం ఇవ్వాలంటూ బైఠాయింపు
సిద్దిపేట, వెలుగు : పెండింగ్ పరిహారాలు చెల్లించకుండా, అలైన్మెంట్ కు విరుద్ధంగా రైల్వే లైన్ పనులు చేస్తున్నారంటూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ లో రైతులు ఆందోళన చేశారు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు వేస్తున్న రైల్వే లైన్ కోసం అధికారులు మాచాపూర్లోని 80 మంది రైతుల నుంచి 50 ఎకరాలను సేకరించారు. పరిహారం చెల్లించినా చెట్లు, బావులకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు.
ఇదే సమయంలో పొలాల నుంచి రైల్వే లైన్ పనులు ప్రారంభించడంతో పాటు అలైన్మెంట్ కోసం అదనంగా మరి కొంత భూమిలో పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీంతో రైతులు ఆగ్రహంతో పనులు జరుగుతున్న చోట బైఠాయించారు. రావాల్సిన పరిహారంతో పాటు అదనపు భూమిలో పనులను నిలిపివేస్తేనే సహకరిస్తామని స్పష్టం చేశారు. కొందరు రైతులకైతే పూర్తి స్థాయిలో పరిహారాలు రాలేదని, సేకరించిన భూముల్లోని చెట్లు, బావులకు ప్రత్యేకంగా పరిహారం ఇస్తామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. పూర్తి పరిహారం అందేవరకు రైల్వే లైన్ పనులను సాగనిచ్చేది లేదన్నారు.