
- మంచి రేటిస్తేనే భూమిలిస్తామంటున్న అన్నదాతలు
- తమ ఊర్లకు సౌలతులు కల్పించాలని డిమాండ్
వరంగల్/ ఖిలా వరంగల్, వెలుగు: మామునూర్ ఎయిర్‍పోర్ట్ భూ నిర్వాసితులు రోడ్డెక్కారు. తమ భూములకు మార్కెట్ లెక్క చూసి మంచి రేటు కట్టియ్యాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు మీటింగుల్లో చెప్పినట్లుగా తమ ఊర్లకు రోడ్లు, ఇతర సౌలతులు కల్పించాలని, ఆ తర్వాతనే భూ సర్వేకు రావాలని ఆందోళన చేపట్టారు. మంగళవారం ఎయిర్పోర్ట్పరిధిలో ఎక్కువగా భూములు కోల్పోతున్న గుంటూర్‍పల్లి, నక్కలపల్లి, గాడిపల్లి, నల్లకుంటకు చెందిన బాధిత రైతులు వరంగల్, నెక్కొండ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ధర్నాలకు అనుమతి లేదని మామునూర్ పోలీసు అధికారులు రైతులకు చెప్పడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీలు తిరుపతి, సతీశ్‌బాబు, కిరణ్‌కుమార్‌తోపాటు పోలీస్ బలగాలు అక్కడకు చేరుకున్నారు. డిమాండ్లపై క్లారిటీ ఇచ్చాకే సర్వే చేయ్యాలని రైతులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.
సర్వేకొచ్చిన ఆర్డీవో.. అడ్డుకున్న రైతులు
మామునూర్ ఎయిర్‍పోర్ట్ నిర్మాణానికి ఇన్నాళ్లుగా జీఎంఆర్ సంస్థతో ఉన్న 150 కిలోమీటర్ల నిబంధన అడ్డుగా ఉండగా, ఇటీవల ఆ సంస్థ ఎన్‍ఓసీ ఇచ్చింది. ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా మామునూర్ ఎయిర్‍పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, 253 ఎకరాల భూ సేకరణ త్వరగా చేపట్టాలని చెప్పింది. సీఎం రేవంత్‍రెడ్డి జిల్లా నేతలు, అధికారులకు అదే విషయాన్ని చెప్పారు. జిల్లా అధికారులు రెండుమూడు రోజులుగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం 166 ఎకరాల భూసర్వే జరగగా, మరో 87 ఎకరాల్లో చేపట్టాల్సి ఉంది. మంగళవారం ఆర్డీవో సత్యపాల్‍రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరావు, ఇతర రెవెన్యూ అధికారులు సర్వే కోసం గ్రామాల వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అధికారుల వద్దకు చేరుకుని అడ్డుకున్నారు.
నష్టపరిహారమియ్యాలే, ఊర్లకు రోడ్లెయ్యాలే..
మామునూర్ ఎయిర్‍పోర్ట్ నిర్మాణంలో తాము వ్యతిరేకం కాదని, ఆందోళనలో పాల్గొన్న భూనిర్వాసితులు తెలిపారు. భూసేకరణ అంశంలో తమతో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్ నాగరాజు సమావేశమయ్యారన్నారు. మార్కెట్ ధరకు అనుగుణంగా నష్టపరిహారం అందిస్తామని మాటిచ్చారని, అదే మాటప్రకారం తమ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో భూములు కోల్పోతున్నోళ్ల పిల్లలు, అర్హులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. నెక్కొండ మార్గంలోని గుంటూర్‍పల్లి, నక్కలపల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని మంత్రి సురేఖ మాటిచ్చారని, కానీ, ఎమ్మెల్యే రేవూరి రోడ్డు ప్రస్తావన ఇప్పుడులేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేజరిగితే పంట పొలాలు పోయి, రోడ్డు మార్గంలేక తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. నష్టపరిహారం, రోడ్డు విషయంలో క్లారిటీ ఇచ్చాకే సర్వే చేపట్టాలని పట్టుబట్టడంతో అధికారుల బృందం అక్కడినుంచి వెళ్లిపోయారు.
రైతుల భూములకు ఆమోదయోగ్య ధర..
మామునూర్ ఎయిర్‍పోర్ట్ భూనిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరలేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‍రెడ్డి తెలిపారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఆయన వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. భూములకు భూమి ఇవ్వడం కుదరదని, రైతుల భూములకు ప్రభుత్వం ఆమోదయోగ్య ధర చెల్లిస్తుందన్నారు. వరంగల్ అభివృద్ధి, మామునూర్ ఎయిర్‍పోర్ట్ కోసం రాష్ట్ర సర్కారు కృషి చేస్తుందన్నారు. రాజకీయ ప్రమేయంతోనే రైతుల్లో ఆందోళన నెలకొన్నదన్నారు.
రేటిచ్చి సర్వేకు రావాలే
మామునూర్ ఎయిర్‍పోర్ట్ వస్తుందంటే ఓ వైపు సంతోషం, మరోవైపు బాధగా ఉంది. ఎయిర్‍పోర్ట్ కోసం మేము సాగు భూములిస్తున్న క్రమంలో వాటికి సరైన రేటు ఇయ్యాలే. ఆ తర్వాతనే అధికారులు సర్వే కోసం రావాలే. 20 ఏండ్లకింద కాలువల పేరుతో కొన్ని భూములు తీసుకున్రు. ఇప్పటికీ అవి రాలేదు. అలాంటి ఇబ్బందులు రావొద్దంటే సరైన న్యాయం చేయాల్సిందే.
జ్యోతి, గుంటూర్‍పల్లి
హైవే రోడ్డెయ్యాలే
ఎయిర్‍పోర్ట్ కోసం అవసరమైన 253 ఎకరాల్లో భూములిస్తుంటే మా గుంటూర్‍పల్లి నుంచే సగం కంటే ఎక్కువ భూములు ఇస్తున్నాం. గతంలో మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ తదితరులు వచ్చి మార్కెట్ రేటుకు అనుగుణంగా న్యాయమైన ధర ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు అలా కుదరదు అంటున్నారు. మాకు మార్కెట్ రేటుతో పాటు మా ఊరిమీది నుంచి రోడ్డు వేయాలే.
గుమ్మడి వెంకటేశ్వర్లు, భూనిర్వాసితుడు