
శివ్వంపేట, వెలుగు : ఎకరాకు రూ.1.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ రైతులు భూసేకరణ గ్రామ సభను బహిష్కరించారు. సిద్దిపేట జిల్లాలోని కొండ పోచమ్మ సాగర్ నుంచి మెదక్ జిల్లా మీదుగా సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్వరకు కెనాల్నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కాలువ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం గురువారం శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల,చెన్నాపూర్ గ్రామాల్లో భూములు కోల్పేయే రైతులతో అధికారులు గ్రామ సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూములు పోతే బతుకులు ఆగమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న భూమి పోతే తామెట్ల బతకాలని, పిల్లల చదువులు, పెళ్లిల్లు ఎలా చేయాలని ప్రశ్నించారు. అందువల్ల ఎకరాకు రూ.1.50 కోట్లు, లేదా భూమికి భూమి ఇస్తేనే భూములు ఇస్తాం లేకపోతే భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు తీసుకుంటే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వమన్నారు.
పెద్ద గొట్టిముక్కుల రైతులు మాట్లాడుతూ గతంలో 100 ఎకరాల పైన భూమి 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు కాలువకు భూములు తీసుకుంటామంటే ఎలా అన్నారు. మాకు కాలువ అవసరం లేదు మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెన్నాపూర్ రైతులన్నారు. రైతుల డిమాండ్‌ను ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పి తహసీల్దార్శ్రీనివాస్ చారి, ఆర్ఐ కిషన్, ఇరిగేషన్ ఆఫీసర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.