నారాయణపూర్ రిజర్వాయర్ కు అందని ఎల్లంపల్లి నీళ్లు
నందిమేడారం పంప్ హౌస్ లోకి నీరు చేరి దెబ్బతిన్న మోటార్లు
రిపేర్‌కు టైం పట్టే అవకాశం
10 వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలు
కరీంనగర్,వెలుగు : ప్రభుత్వాన్ని నమ్ముకుని నారాయణపూర్ రిజర్వాయర్ కింద యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు ఈసారి పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అదనుదాటుతున్నా... ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లెత్తిపోయకపోవడంతో రిజర్వాయర్ కింద సాగు చేసిన పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. రైతుల ఆందోళనలకు స్పందించి మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టులోని నందిమేడారం పంప్ హౌస్ నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీళ్లు వదిలిన విషయం తెలిసిందే. మోటార్లు ఆన్ చేసిన కొద్ది సేపటికే గేట్ వాల్వ్ పగిలి పంప్ హౌస్ మునగడంతో కేవలం 28 నిమిషాల్లోనే నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. నీళ్లు వదలడంలో అప్పటికే ఇరిగేషన్ ఇంజినీర్లు జాప్యం చేయడం, పంప్ హౌస్ మునగడంతో రిపేర్లకు టైంపట్టే అవకాశం ఉంది.
ఐదు మండలాలకు...
నారాయణపూర్ చెరువు ఆయకట్టు కింద ఒకప్పుడు నారాయణపూర్రైతుల భూములే ఉండేవి. ఐదేళ్ల క్రితం అధికారులు ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చడంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని ఐదు మండలాలకు నీరందించే అవకాశం ఉండేది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎత్తిపోతలతో ఈ రిజర్వాయర్ ను నింపుతున్నారు. రిజర్వాయర్ గా మార్చాక గంగాధర, రామడుగు, కొడిమ్యాల, మల్యాల, బోయినపల్లి మండలాల్లోని సుమారు 49,500 ఎకరాలకు సాగునీరందించాలని అధికారులు తొలుత టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మెట్టప్రాంతాల్లో నిర్మించిన 30 సబ్ కెనాల్స్ ద్వారా పొలాలకు నీరందించారు. తర్వాత రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 46 చెరువుల నింపడం ద్వారా 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయకపోవడంతో పంటలు సాగుచేసిన రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజర్వాయర్‌లోకి నింపి పంట పొలాలకు నీరందించాలని కోరుతున్నారు.
గండి పూడ్చడంలో నిర్లక్ష్యం..
గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్‌కు నిరుడు జూలై 13న భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్‌లోకి భారీ వరద రావడంతో నారాయణపూర్ సమీపంలో కట్ట తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తమైన ఆఫీసర్లు అదేరోజు రాత్రి రిజర్వాయర్ కట్టకు కుడి వైపున గండి కొట్టి నీటిని బయటికి వదిలారు. ఈ క్రమంలో ఎల్లమ్మ చెరువు కట్ట తెగింది. చెరువులకు గండి కొట్టి ఆర్నెళ్లయినా రిపేర్ చేపట్టకుండా ఇంజినీరింగ్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. రైతుల ఆందోళనలు చేయడంతో ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టి నెలాఖరులో పూర్తి చేశారు. తీరా పనులు పూర్తయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు మోటార్లు ఆన్ చేయడంతో గేట్ వాల్వ్ పగిలి నీళ్లన్ని పంప్ హౌస్ ను ముంచెత్తాయి. డిసెంబర్, జనవరిలోనే గండి పూడ్చివేత పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో సాగుచేసిన పంటలు నీరందక ఎండిపోతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రేండ్ల గంగాధర్. ఈయనది గంగాధర మండలం చర్లపల్లి(ఎన్) గ్రామం. ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజర్వాయర్ లో నింపి ఎడమ కాల్వ ద్వారా సాగు నీరందిస్తారనే ఆశతో ఐదెకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటికే ఎండలు ముదిరిపోవడంతో బావిలోని నీరు పొలానికి సరిపోవడం లేదు. ఎడమ కాల్వ ద్వారా అధికారులు నీటిని వదలడం లేదు. అధికారులు రెండు, మూడు రోజుల్లో ఎల్లంపల్లి నీటిని నారాయణపూర్ రిజర్వాయర్ కు తరలించి అక్కడి నుంచి ఎడమ కాలువ ద్వారా నీటిని వదిలితే ఆయకట్టు పొలాలన్నీ బతుకుతాయి. లేదంటే ఎండిపోయే పరిస్థితి నెలకొంది.