వరంగల్, వెలుగు:వరంగల్ మామునూర్ ఎయిర్‍పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులు ఆఖరి పంట సాగు చేస్తున్నారు. వారసత్వంగా వచ్చిన భూముల్లో పంటలు సాగు చేస్తుండగా.. ఇప్పుడు ఆ భూము లు ఎయిర్‍పోర్ట్ కిందకు వెళ్తున్నాయి. ఇప్పటికే సేకరించిన భూములకు అధికారులు మార్కింగ్ చేశారు. ప్రభుత్వం పరిహారం అందించేందుకు నిధులు, జీఓ విడుదల చేసింది. అయితే భూములపై ఉన్న ప్రేమతో రైతులు చివరిసారిగా యాసంగి పంట వేస్తున్నారు. దుక్కి దున్ని నారు పోస్తున్నారు. వచ్చే మార్చి తర్వాతే రైతులు తమ భూములను అప్పగించనున్నారు.
4 గ్రామాల్లో 223 మంది రైతులు
ఎయిర్‍పోర్ట్ విస్తరణకు 949.14 ఎకరాల భూమి అవసరం. ప్రస్తుతానికి 696.14 ఎకరా లు ఎయిర్‍పోర్ట్ పరిధిలో ఉంది. అభివృద్ధికి మరో 280.30 ఎకరాలు కావాల్సి ఉందని ఆఫీసర్లు కన్‍ఫర్మ్ చేశారు. అయితే ఇందులోనూ 27.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగతా 253 ఎకరాలను రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సేకరించేందుకు సిద్ధమైంది. ఇవన్నీ గుంటూర్‍పల్లి, నక్కలపల్లి, దూపకుంట, గాలిపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ పొలాలు. ప్రస్తుతం రంగశాయిపేట జంక్షన్ నుంచి గవిచర్ల వెళ్లే మెయిన్ రోడ్డు కూడా దాదాపు 4 కిలోమీటర్లు ఎయిర్‍పోర్ట్ అభివృద్ధి చేసే భూముల్లోకి రానుంది. గాడిపల్లిలో13 ఇండ్లు ఉన్నాయి. ఎయిర్‍పోర్ట్ డెవలప్‍మెంట్‍లో భాగంగా ఏ ఏరియా వరకు భూములు వెళ్లానున్నాయో గత నాలుగైదేండ్ల కిందనే క్లారిటీ రావడంతో రైతులు పరిహారంలో తప్పితే.. భూములు ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు.
పరిహారంగా డబ్బులకు ఓకే
ఎయిర్‍పోర్ట్ పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు భూమి విలువకు ప్రభుత్వ ధర ప్రకారం నష్టపరిహారం కట్టిస్తారనే ఉద్దేశంతో ముందుగా భూమికి బదులు భూమినే అడిగారు. అలాకాకుండా డబ్బులే అయితే.. మార్కెట్ రేటుకు అటు ఇటుగా ఇవ్వాలన్నారు. ఇదే విషయమై జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‍రెడ్డి, కేఆర్ నాగరాజు పలుమార్లు రైతులతో సమావేశం అయ్యారు. జిల్లా కలెక్టర్ శారద రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం భూ సేకరణకు రూ.205 కోట్లు కేటాయించింది. అయితే దాదాపు 10 మంది రైతులు తమకు భూమినే ఇవ్వాలని కోరుతున్నట్లు చెబుతున్నారు.
మార్చి, ఏప్రిల్‍లో కోతలు
ఎయిర్ పోర్ట్ కు భూములు ఇస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రూ.205 కోట్లు మంజూరు చేస్తూ ఈనెల 17న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరినట్లయింది. ఒక్కో రైతుకు ఉన్న భూమి, పట్టా పాస్ బుక్, పరిహారం చెల్లింపు ధర, బ్యాంక్ అకౌంట్ల వివరాలు వంటి పనులు చేయాల్సి ఉంది. చివరి అవకాశంగా ఇక్కడి రైతులు తమ భూముల్లో యాసంగి సాగుకు రెడీ అయ్యారు. ఈ లెక్కన వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో చివరి పంట కోతలు పూర్తవగానే భూములు అప్పగించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండ్రోజుల కింద సీఎం రేవంత్‍రెడ్డి, ఎంపీ కడియం కావ్య మరోసారి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి ఎయిర్‍పోర్ట్ భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పురోగతిని వివరించారు. దీంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మామునూరు ఎయిర్‍పోర్ట్ ఏర్పాటుకు అవసరమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో సహకారం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. వచ్చే మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి అభివృద్ధి పనులు చేపట్టేలా అధికారులు పనులు స్పీడప్ చేశారు.