
- పంట పండినా గిట్టుబాటు ధర లేదు
- గరిష్ట ధర రూ.14 వేలు దాటట్లే
- సగటున క్వింటాల్ ధర రూ.12 వేలే
- గత మూడేళ్లలో రెట్టింపు ధరలు
- ప్రస్తుతం భారీగా పడిపోతున్న ధరలు
- ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటున్న రైతన్నలు
హైదరాబాద్, వెలుగు: మిర్చి సాగు ఈ ఏడాది రైతులను అతలాకుతలం చేసింది. ఆరుగాలం శ్రమించి మిర్చి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ లేక రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి మిర్చి పంట సాగుచేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఎగుమతులు తగ్గడం వల్లే ధరలు పడిపోతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా.. మిర్చి సాగుతో పాటు మిర్చి పంట దిగుబడిలోనూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో సాధారణంగా 2.46 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేస్తారు. కానీ, ఈయేడు వర్షాలు కొంత లేట్ కావడం, పరిస్థితులు అనుకూలించడంతో పత్తికి బదులుగా మిరప అధికంగా సాగు చేశారు. సాధారణ సాగు కంటే అధనంగా అరలక్ష ఎకరాలకు పైగా పెరిగింది. అత్యధికంగా వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో 2.96 లక్షల ఎకరాలకుపైగా మిర్చి సాగు చేస్తున్నారని హార్టికల్చర్ ఆఫీసర్లు తెలిపారు.
రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు నష్టం
గత మూడేళ్లుగా మార్చి నెలలో గరిష్టంగా రూ.18 వేల నుంచి రూ.22 వేలు పలికిన ఎండు మిర్చి ధరలు.. నేడు గరిష్ట ధర రూ.14 వేలు కూడా పలకడం లేదు. మంగళవారం ఖమ్మం మార్కెట్లో గరిష్టంగా రూ.14 వేలు పలుకగా, మోడల్ ధర రూ.13,700 పలికింది. కనిష్ట ధర రూ.6 వేలు పలికింది. మార్కెట్లో ఎక్కువగా సగటున రూ.12 వేలే ధర పలుకుతున్నదని రైతులు వాపోతున్నరు. దీంతో గతంలో కంటే క్వింటాల్ మిర్చికి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు నష్టాలతో అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, తాలు మిర్చి ధర క్వింటాల్ గరిష్టంగా రూ.6500, కనిష్టంగా రూ.5200, మోడల్ ధర రూ.5700 పలికింది. నిరుడు , ముందటేడు తాలు మిర్చి రూ.10 వేల వరకు పలికింది.
ఎగుమతులు లేకనే..
మిర్చి ధరల పతనానికి విదేశాలకు ఎగుమతులు తగ్గడమే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. గత రెండు, మూడేళ్లుగా మిర్చికి మంచి ధరలు రావడంతో రాష్ట్రంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని, అదే స్థాయిలో ఎగుమతులు పడిపోయాయని తెలిపారు. మిర్చి ఎగుమతుల్లో చైనా, థాయ్‌లాండ్, శ్రీలంక వంటి తూర్పు ఆసియా దేశాలకే 60 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యే చైనాకు ఎగుమతులు తగ్గడంతో ధరల పతనానికి కారణమని అధికారులు వెల్లడించారు.
పెరిగిన పెట్టుబడి... తగ్గిన దిగుబడి
మిర్చి పంట ఎకరాకు రూ.1.72 లక్షల మేర పెట్టుబడి ఖర్చు చేస్తుండగా.. తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుమందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఎకరాకు 35 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా సగం కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు తెలిపారు. ఒక్కో ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వస్తే రైతుకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎకరాకు రూ.2 లక్షల పెట్టుబడి పెట్టినా దిగుబడి ఎకరాకు సగటున 20 నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయిందని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు మిరప పంటను రైతు మార్కెట్‌కు తీసుకువస్తున్న టైంలో ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి.
క్వింటాల్‌కు రూ.25 వేలు ప్రకటించాలి
మిర్చి రైతులు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. మిర్చి పంటను ఆహార పంటల జాబితాలో చేర్చి క్వింటాల్ కు రూ.25 వేల మద్దతు ధర నిర్ణయించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. ఎక్స్పోర్ట్ ద్వారా విదేశీ మారక ద్రవ్యం పొందిన కేంద్ర ప్రభుత్వం.. కష్టంలో ఉన్న మిర్చి రైతులను ఆదుకోవాలి. పురుగుమందులపై 18 శాతం, ఎరువులపై 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించాలి. ఖమ్మంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలి.- బొంతు రాంబాబు, రైతు సంఘం నేత