కోల్‌బెల్ట్,వెలుగు:నేషనల్ హైవే కోసం భూములను ఇచ్చిన వందల మంది రైతులు ఇప్పుడు పంటచేన్లకు వెళ్లేందుకు దారిలేక అవస్థలు పడుతున్నారు. మందమర్రి మండలం శేషపల్లి రైతులు ఐదేండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. చేన్లకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పడు పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు.
బైపాస్ రోడ్డుతో మూసుకపోయిన దారులు
మంచిర్యాల–- చంద్రాపూర్(మహారాష్ట్ర) మధ్య నేషనల్ హైవే 363 నిర్మిస్తున్నారు. మందమర్రి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కుర్మపల్లి నుంచి దుబ్బాపల్లి, క్యాతనపల్లి, శేషపల్లి, అమరవాది, మంచిర్యాల మండలం దొరగారిపల్లి, నస్పూర్ మండలం సింగరేణి పాలిటెక్నిక్ వరకూ 2018 లో భూములు సేకరించారు. చేన్లకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ దారులు వేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన చోట అండర్ పాస్‌లు, సర్వీసు రోడ్లను కడతామన్నారు. కానీ, అవేమీ నిర్మించకుండానే దుబ్బాపల్లి, క్యాతనపల్లి, శేషపల్లి, అమరవాది గ్రామాలు, పంటచేన్ల మధ్య నుంచి నేషనల్ హైవే నిర్మించారు. వందల ఎకరాల పంటచేన్లకు వెళ్లేందుకు దారులన్నీ మూసుకున్నాయి.
హైవే తో అవస్థలు..
సర్వీస్ రోడ్లు నిర్మిస్తామని చెప్పి ఐదేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. దీంతో రైతులు రోజూ 6 కి.మీ దూరం తిరిగివెళ్లి పంటచేన్లను చేరుకుంటున్నారు. పది నిమిషాల్లో పొలాలకు వెళ్లే రైతులు ఇప్పుడు గంట అయినా చేరుకోవడం లేదని అంటున్నారు. మరో పది రోజుల్లో బైపాస్ మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. దీంతో రైతులు పంటచేన్లకు వెళ్లడంపై ఆందోళన చెందుతున్నారు. కొత్తగా బైపాస్ నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి వద్ద అండర్‌పాస్, బీటీ సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ఆ హైవే పనులను రైతులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఆందోళన చేస్తే కొన్ని చోట్ల నిర్మాణం..
అండర్ పాస్‌లు నిర్మించాలని దుబ్బాపల్లి గ్రామస్తులు నెల రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. దీంతో అధికారులు కుర్మపల్లి -సింగరేణి జీఎం ఆఫీస్ బైపాస్ రోడ్డులోని రామకృష్ణాపూర్ నుంచి మంచిర్యాలకు వెళ్లే మార్గంలో, క్యాతనపల్లి , నస్పూర్ మండలంలో కొన్ని చోట్ల అండర్ పాస్‌లు నిర్మించారు. అయితే ఐదేండ్లుగా శేషాపల్లి గ్రామస్తులు తమ పంటచేన్లకు వెళ్లేందుకు అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే అధికారులను కలిసి పనులు అడ్డుకున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
చేన్లకు పోయేందుకు గంట పడుతుంది
పెద్దరోడ్డు(నేషనల్ హైవే)వేసుడుతోటి ఎండ్లబండిపై చేన్లకు పొయేందుకు గంట పడుతుంది. అప్పట్లో పదినిమిషాల్లో చేరుకునేవాళ్లం. ఇప్పుడు కొత్తరోడ్డుపై బండ్లు నడిస్తే ఎట్ల పోతాం. చేనుకు పోవాలంటే 6 కి.మీ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. రైల్వే బ్రిడ్జి కాడా అండర్‌పాస్ చేయాలె. మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు
- జాగటి భీమయ్య, శేషపల్లి రైతు
రైల్వే బ్రిడ్జి వద్ద అండర్‌పాస్ ఇయ్యాలె
పంటచేన్లకు వెళ్లివచ్చేందుకు కొత్తగా నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జి వద్ద అధికారికంగా అండర్‌పాస్ కు అవకాశం కల్పించాలె. హైవేకు ఇరువైపుల బీటీతో సర్వీసు రోడ్లను నిర్మించాలె. భూసేకరణ సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలె. కోల్పోయిన చెట్లకు కూడా ఇంకా పరిహారం ఇవ్వలేదు -వెంకటేశ్, మల్లేశ్, రైతులు