ముస్తాబాద్, వెలుగు : వడగండ్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో ఎంపీ పర్యటించారు. గన్నేవారిపల్లె గ్రామంలో వడగండ్లతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. వడగండ్లతో తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు ఎంపీ ఎదుట గోడువెళ్లబోసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా ఏమైందని ప్రశ్నించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు రైతులను మోసం చేశాయని ఆరోపించారు. రైతుల సమస్యల కోసం తాను పోరాడుతానన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు రుద్రమదేవి, జె.సంగప్ప, జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు.