కామారెడ్డి వెలుగు: వానకాలమొచ్చి నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద వర్షం పడలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద వానలు లేక, భూమి సరిగా తడవక, ముందుగా వేసిన విత్తనాలకు ఇప్పటి వరకు మొలకలు రావడం లేదు. ఇంకా విత్తనాలు వేయని అన్నదాతలు సమయం మించిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో గతేడాది జూన్30 వరకు 187 మిల్లీమీటర్ల వర్షం కురవగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 61.5 మిల్లీమీటర్ల వర్షమే పడింది.
జిల్లాలోని అన్ని మండలాల్లోనూ లోటు వర్షపాతమే ఉంది. సకాలంలో వర్షాలు కురిసుంటే ఈ పాటికే మక్క, పప్పు దినుసులు, సోయా, పత్తి పంటల సాగు కంప్లీటయ్యేది. చాలా ఏరియాల్లో ఇంకా నేల పూర్తిస్థాయిలో తడవనే లేదు. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో రైతులు వానలు కురుస్తాయనే ఆశతో మక్క, పత్తి విత్తనాలు వేశారు. సదాశివ్నగర్, గాంధారి, తాడ్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లోని మెజార్టీ రైతులు మక్క, పత్తి విత్తనాలు వేయడం కంప్లీట్ చేశారు.
విత్తనాలు పెట్టినప్పటీ నుంచి రోజుల తరబడి వాన జాడ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ విత్తనం మొలకెత్తుతుందా లేదా అనే సందేహం నెలకొంది. సదాశివ్నగర్ మండలంలో బోర్లు ఉన్న రైతులు పత్తి, మక్క పంటలకు డ్రిప్ద్వారా తడి అందించి, కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సీజన్లో 5.16 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో వరి 2.95 లక్షల ఎకరాలు సాగు చేయనున్నట్లు అంచనా. వాస్తవానికి మృగశిర, ఆరుద్ర కార్తెల్లో భూమిలో విత్తనాలు వేస్తే దిగుబడి వస్తుందని రైతులు భావిస్తారు. ప్రతిసారి సీజన్ ప్రారంభంతోనే ఓ మోస్తరు వానలు కురవడంతో వ్యవసాయ పనులు జోరుగా సాగేవి. ఈ సారి వానలు లేకపోవడంతో మొలకలు రాని పరిస్థితి నెలకొంది.
మొలక రాకుంటే మళ్లీ వేయాల్సిందే..
పలు మండలాల్లో 15 వేల ఎకరాల్లో పత్తి, మక్క విత్తులు వేశారు. వర్షాలు పడకముందే విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత పెద్ద వాన కురిసి భూమి బాగా తడిస్తే మొలక వస్తుంది. చినుకులు కురిస్తే భూమి లోపలి వరకు తడి అందక విత్తనం కుళ్లిపోడానికి ఆస్కారం ఉంటుందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. ఫస్ట్ వేసిన విత్తనం మొలక రాకపోతే రెండో సారి విత్తనాలు వేయాల్సి వస్తుంది. దీంతో రైతులకు అదనపు భారం పడుతుంది. సమయం వృథా అవుతుంది.
కాలం పరేషాన్ చేస్తోంది
కొద్దిగా చినుకులు పడడంతో మక్క పంట వేసిన. ఇంకా మొలక రాలేదు. కాలం ఈ సారి పరేషాన్ చేస్తోంది. మృగశిర, ఆరుద్ర కార్తెల్లో విత్తనం భూమిలో పడితే పంట ఎదుగుదల బాగుంటుంది. ఇంకా కొందరు రైతులు విత్తనాలు వేయలేదు.
– సాయిరెడ్డి, తాడ్వాయి మండలం
పెద్దగా వాన లేదు
వానాకాలం వచ్చినా, అనుకున్నంత పెద్ద వాన ఇయ్యాల్టీ దాక పడలేదు. వాన పడుతుందనే ఆశతో పత్తి, మక్క విత్తనాలు వేసినం. మొలక రాకుంటే మళ్లీ వేయాలి. పోయిన సారి గిట్ల లేకుండే.
– రాజయ్య, సదాశివ్నగర్