
- అధ్వానంగా నిర్మల్ జిల్లాలోని కెనాల్స్ పరిస్థితి
- రిపేర్లకు ఈసారి అంచనాల్లేవ్
- వర్షాలు పడితే పనులు కష్టమే
- కాంగ్రెస్ ప్రభుత్వంపైనే రైతుల ఆశలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో దాదాపు లక్ష 30 వేల ఎకరాలకు సాగు నీరందించే కడెం, సరస్వతి, స్వర్ణ, గడ్డెన్న వాగు, సదర్మాట్ కాలువల రిపేర్లపై అడుగడుగునా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏళ్ల నుంచి సరైన రిపేర్లు ల్లేక టేల్ ఎండ్ వరకు నీళ్లు అందడం లేదు. ఏటా వేసవిలో కాలువలకు రిపేర్లు చేయాలని రైతులు కోరుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు లేడు. బీఆర్ఎస్ హయాంలో నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో వీటి పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా తయారైంది. ఏటా రిపేర్లకు అధికారులు అంచనాలు తయారు చేసి పంపడం, సర్కారు వాటిని పక్కన పెట్టడం రివాజుగా మారింది. అంచనాలకు మోక్షం లభించకపోవడంతో ఇరిగేషన్ అధికారులు సైతం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈసారి ప్రధాన కాలువల రిపేర్లకు సంబంధించి ఇప్పటివరకు పూర్తిస్థాయి ప్రతిపాదనలు రెడీ చేయలేదు.
ఈసారి చేయకుంటే కష్టమే..
చాలా చోట్ల కాలువల్లో పూడిక పేరుకుపోయి లైనింగ్ దెబ్బతినడమే కాకుండా కట్టలు బలహీనపడ్డాయి. వీటికి తోడుగా గండ్లు, కాలువల మధ్యలో పెద్దఎత్తున పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారింది. గండ్లు పడిన సమయంలో అధికారులు తాత్కా లిక మరమ్మతులు చేస్తున్నారు తప్పితే శాశ్వత ప్రాతిపదికన పనులు చేయడం లేదు. ఈసారి కూడా రిపేర్లు జరగకపోతే పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరందడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.
ఆందోళనలో ఆయకట్టు రైతులు
ప్రధాన కాలువలకు మరమ్మతులు జరగకపోవడంతో ఆయకట్టు రైతాంగం ఆందోళనకు గురవుతోంది. సరస్వతి కాలువ కింద 38 వేల ఎకరాలు, కడెం కింద 63 వేలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 10 వేలు, సదర్మాట్ కింద 6 వేలు, గడ్డన్న వాగు ప్రాజెక్టు కాలువల కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 2004 వరకు ప్రతి ఏటా రిపేర్ల కోసం నిధులు మంజూరు అయ్యేవి. 2010 నుంచి ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంభించడం మొదలుపెట్టాయి. అప్పటినుంచి ఇప్పటివరకు అంచనాలకు అడపాదడపా నిధులు మంజూరయ్యాయే తప్ప పూర్తిస్థాయిలో రాలేదు.
ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువలపై పూర్తి నిర్లక్ష్యం వహించిందన్న విమర్శలున్నాయి. రిపేర్లు సక్రమంగా జరగని కారణంగా సరస్వతి కాలువ ఒకటో నంబర్ డిస్ట్రిబ్యూటరీ నుంచి 26వ నంబర్ వరకు మొత్తం 21,874 ఎకరాల ఆయకట్టు, అలాగే కడెం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే డిస్ట్రిబ్యూటరీలు 27, 28 కింది ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడింది. కడెం ప్రాజెక్టు కాలువలలో కూడా పూడిక పేరుకుపోవడం, పిచ్చి మొక్కలు ఇష్టానుసారంగా పెరగడంతో లైనింగ్ చెడిపోయింది. స్వర్ణ ప్రాజెక్టు కాలువ పరిస్థితి కూడా దయనీయంగా మారింది.
చాలాచోట్ల ఈ కాలువ రూపురేఖలే మారిపోయాయి. ఖానాపూర్ పరిధిలోని సదర్మాట్ కాలువకు రిపేర్లు చేయాలని రైతులు ఇప్పటికే చాలాసార్లు ఆందోళనలు చేపట్టారు. మరోవైపు జిల్లాలోని ప్యాకేజీ నంబర్ 27, 28 కాళేశ్వరం హై లెవెల్ కాలువల పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. ఈ క్రమంలో రైతులంతా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కడెం ప్రాజెక్టు రిపేర్ల కోసం దాదాపు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించిన సంగతి తెలిసిందే. దీంతో కాలువలకు నిధులు మంజూరు చేయాలంటూ మంత్రి సీతక్కకు వినతిపత్రాలు సైతం అందజేశారు.
కాలువలకు రిపేర్లు చేయాలి
సరస్వతి కాలువకు ప్రతి ఏటా మరమ్మతులు చేయడం లేదు. దీంతో రెండో పంటకు నీరందని పరిస్థితి నెలకొంది. 10 ఏళ్ల నుంచి సక్రమంగా మరమ్మతులు చేయడం లేదు. మేమంతా రబీ సీజన్ లో సాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా కాలువలన్నింటికీ శాశ్వత ప్రాతిపదికన రిపేర్లు చేయించాలి.
బొడ్డు సాయన్న, రైతు, లక్ష్మణచాంద గ్రామం