- ఆసిఫాబాద్ జిల్లాలో 3.40 ఎకరాల్లో పత్తి సాగు
- ముందస్తు వర్షాలతో విత్తనాలు వేసిన రైతులు
- భారీ వర్షాలు పడకపోవడంతో వాడిపోతున్న మొలకలు
- స్ర్పింక్లర్ల ద్వారా నీటిని స్ర్పే చేస్తున్న రైతులు
- మరో సారి విత్తనాలు వేయక తప్పదంటున్న అన్నదాతలు
ఆసిఫాబాద్, వెలుగు : గత వారం రోజులుగా వానలు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పడిన తొలకరి వర్షాలకు మెజార్టీ రైతులు పత్తి గింజలు వేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వర్షం పడకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. మృగశిర కార్తె వచ్చి ఇరవై రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వానలు పడలేదు.
అడపాదడపా ఎక్కడో ఒకచోట చిన్నపాటి వర్షం తప్ప ఇప్పటివరకు ఒక్కటి కూడా పెద్ద వాన పడలేదు. దీంతో వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన పత్తి గింజలు మాడిపోవడంతో మరోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా158.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు 111.5 మిల్లీమీటర్లు నమోదు అయింది. మరో వైపు వరుణుడు కరుణించాలని, వర్షాలు పడాలని ప్రజలు గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు.
మూడో వంతు పత్తి పంటనే...
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో 4.50 లక్షల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతాయని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందులో మూడో వంతు 3.40 లక్షల ఎకరాల్లో పత్తి, సాగు చేస్తుండగా 59 వేల ఎకరాల్లో వరి, 38,239 ఎకరాల్లో కందులు, 6,089 ఎకరాల్లో కందులు, 1,700 ఎకరాల్లో పెసర్లు, 163 ఎకరాల్లో మినుములు, 680 ఎకరాల్లో జొన్నలు, 170 ఎకరాల్లో వేరుశనగ, 3,178 ఎకరాల్లో మిరప మరో 10 ఎకరాల్లో ఆముదం సాగు చేస్తున్నారు.
వర్షాలు పడతాయన్న ఆశతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేశారు. కానీ అవి వేసిన నాటి నుంచి ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. నీటి వనరులు ఉన్న రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు స్ర్పింక్లర్ల ద్వారా నీటిని స్ర్పే చేస్తున్నారు. ఎలాంటి నీటి వనరులు లేక కేవంలం వర్షంపైనే ఆధారపడి విత్తనాలు వేసిన రైతులు మాత్రం మరోసారి విత్తనాలు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
వరుణుడి కరుణ కోసం పూజలు
వరుణుడి కరుణించాలని, వానలు సమృద్ధిగా పడాలని కోరుతూ పట్టణాలు, గ్రామాల్లో రైతులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విగ్రహాలకు నీళ్లు పోసి వానలు కురవాలని మొక్కుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అగ్రి ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కప్పతల్లి ఆటలు ఆడారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించి, యాటలు కోసి వర్షాలు పడాలని కోరుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లా అగ్రి ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కవ్వాల మహేందర్, ఉపాధ్యక్షుడు కొండ తిరుపతి, నరేశ్, నరేందర్ రాజు, సురేశ్, ప్రణయ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి మొలకలు వాడిపోతున్నయ్
వానలు లేక పత్తి గింజలు మొలకెత్తడం లేదు. కొన్ని మొలకలు వచ్చినప్పటికీ వానలు లేకపోవడంతో వాడిపోతున్నాయి. మొగులు పట్టి ఊరిస్తుందే తప్ప వాన మాత్రం పడడం లేదు. ఈ టైంలో వాన పడితే పత్తి మొలకలు ప్రాణం పడుతయ్.
- కాటెల సంజీవ్, రైతు, దహెగాం