మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నవాబుపేట, వెలుగు: నవాబుపేట మండలంలోని యన్మన్​గండ్ల పెద్దచెరువు కట్ట తెగి పంటలు నాశనం అయ్యాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు మొరపెట్టుకున్నారు. తెగిన కట్టతో పాటు నష్టపోయిన పొలాలను బుధవారం  అడిషనల్​ కలెక్టర్​ సీతారామారావు  అగ్రికల్చర్​ ఆఫీసర్​ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌‌‌‌ రాజేందర్​రెడ్డితో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా ఇసుక మేటలు వేసి పొలాలతో పాటు బోర్లు కూడా  పాడయ్యాయని,  వాటికి కూడా నష్ట పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు కోరారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్‌‌‌‌  బోర్ల వివరాలు  కూడా పంటనష్టం నివేదికలో పొందు పర్చాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అగ్రికల్చర్​ ఆఫీసర్​ కృష్ణకిషోర్​, ఆర్‌‌‌‌ఐ గోవర్ధన్​ పాల్గొన్నారు.

రైతులను పరామర్శించిన ఎంపీ

చెరువు కట్ట తెగి పంట నష్టపోయిన రైతులను బుధవారం ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి పరామర్శించారు.  చెరువు కట్టను మళ్లీ కట్టేలా చర్యలు తీసుకుంటామని, బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని  హామీనిచ్చారు. ఎంపీ వెంట ఎంపీపీ అనంతయ్య, సింగిల్​విండో చైర్మన్​ నర్సిములు, మండల నాయకులు ఉన్నారు. 

ఓటర్‌‌‌‌ కార్డుకు ఆధార్ లింక్ చేయాలి

గద్వాల, వెలుగు: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి ఫోన్‌‌లో గరుడ యాప్‌‌ను డౌన్‌‌లోడ్‌‌ చేయించి, ఓటర్‌‌‌‌ కార్డుకు ఆధార్‌‌‌‌ను లింక్ చేయాలని ఇన్ చార్జి కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాల భవన్‌‌లో బీఎల్వోలు, సూపర్‌‌‌‌ వైజర్లతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బీఎల్వో రోజూ 10 మందికైనా గరుడ యాప్ డౌన్‌‌లోడ్ చేయించాలని సూచించారు.  కొత్త ఓటరుగా నమోదు చేయడంతో పాటు ఓటర్ మరణిస్తే డెత్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ బాబు, ముసాయిదా బేగం, మదన్మోహన్ పాల్గొన్నారు.

లోన్లు సకాలంలో చెల్లించాలి

బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను సద్వినియోగం చేసుకొని, తిరిగి సకాలంలో చెల్లించాలని ఇన్‌‌చార్జి కలెక్టర్ శ్రీ హర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌‌లో యూనియన్ బ్యాంక్ రుణమేళా కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడు మండలాల్లోని 152 మహిళా సంఘాలకు ఐదు బ్రాంచ్‌‌ల నుంచి  రూ.11 కోట్ల లోన్‌‌ చెక్కులను అందించారు. ఈ ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆర్ఎం రమణ, ఎల్డీఎం అయ్యప్ రెడ్డి, ఇన్‌‌చార్జి డీఆర్డీవో నాగేంద్రం పాల్గొన్నారు. 

మీటింగ్‌‌కు ఆఫీసర్లు రాకుంటే ఎట్ల?

ఎంపీ రాములు ఆగ్రహం

ఆమనగల్లు, వెలుగు: మండల జనరల్ బాడీ మీటింగ్‌‌ డివిజన్ స్థాయి ఆఫీసర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఎంపీ రాములు ఆదేశించారు. బుధవారం ఆమనగల్లు ఎంపీపీ అనిత అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు.  పంచాయతీ రాజ్ డీఈ , డీఎల్‌‌పీవో, మిషన్​ భగీరథ డీఈలు గైర్హాజరు కావడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా ఎజెండా చదివితే సరిపోదని. ఉన్నతాధికారులు హాజరై ప్రజాప్రతినిధుల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు.  మండలంలోని కొన్ని గ్రామాలలో రూల్స్‌‌కు విరుద్ధంగా వెంచర్లు చేస్తున్నారని, వాటికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని పలువురు సర్పంచులు సభ దృష్టి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డీటీసీపీ అనుమతి పొందిన తర్వాతే వెంచర్లు చేయాలని, లేదంటే చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మండల పధిలోని వెంచర్లపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌‌‌‌, ఎంపీడీవో, ఎంపీవోలకు సూచించారు. అంగన్​వాడీలలో కుల్లిపోయిన గుడ్లనుఇస్తున్నారని, బాలామృతం బర్రెల పాలవుతోందని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీడీపీవో సక్కు బాయి తెలిపారు.

ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ గెలవాలె

అలంపూర్, లింగాల, ధన్వాడ, వెలుగు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌‌, డీజిల్ , గ్యాస్‌‌, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి సామాన్యులపై భారం మోపుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. ధరలు తగ్గాలంటే కాంగ్రెస్‌‌ పార్టీకి మద్దతివ్వాలని కోరారు. ఆజాదీ గౌరవ పాదయాత్రలో భాగంగా బుధవారం ఉండవెల్లి మండలం కంచుపాడు నుంచి తక్కశిల, ఇటిక్యాలపాడు, మానవపాడు మండలంలోని చండూరు, జల్లాపురం, బోరవెల్లి, గార్లపాడు , వీరాపురం వరకు నడిచారు. అంతకుముందు కంచుపాడులో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని ఆయన నివాసంలో  మర్యాదపూర్వకంగా కలిశారు.   అనంతరం సంపత్‌‌ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందిస్తే.. మోడీ సర్కారు మాత్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందన్నారు.  అలాగే నాగర్‌‌‌‌ కర్నూల్ డీసీసీ ప్రెసిడెంట్‌‌ వంశీకృష్ణ  బల్మూర్ మండలం అనంతపురం గ్రామం నుంచి లింగాల, అవుసలి కుంట మీదుగా అంబటిపల్లి వరకు పాదయాత్ర చేశారు. ఆయనమాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయడం లేదని మండిపడ్డారు. పింఛన్లు, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ ఇలా ఒక్కటీ అమలు కావడం లేదన్నారు.

సర్పంచ్ ​భర్త పై ఎంపీటీసీ బంధువు దాడి

అచ్చంపేట, వెలుగు: బల్మూర్​మండలం మహదేవ్​పూర్​ సర్పంచ్‌‌ భర్తపై ఎంపీటీసీ బంధువు దాడి చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం..  సర్పంచ్‌‌ ​మయూరి భర్త చెలమల్ల రాంప్రసాద్‌‌కు అదే గ్రామానికి చెందిన ఎంపీటీసీ పెందోట ఆంజనేయులు, అతని బంధువు వెలుగొండకు చెందిన వినయ్‌‌కు పాత కక్షలు ఉన్నాయి. మంగళవారం రాత్రి వినయ్ రాంప్రసాద్‌‌పై బీరుసీసాతో దాడి చేశాడు. అడ్డుకోబోయిన గ్రామానికి చెందిన అరవింద్​ రెడ్డి, మాధవ్‌‌ను కూడా కొట్టాడు. ఈ దాడిలో అరవింద్​ రెడ్డి చేతికి గాయమైంది. దీంతో వారిపై చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలని బాధితుడు రాంప్రసాద్‌‌ బుధవారం బల్మూర్ ​పీఎస్‌‌లో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ అంజనేయులు, వినయ్​లు కారుతో యాక్సిడెంట్​చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించాడు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బల్మూర్​ఎస్సై శివానంద గౌడ్​ తెలిపాడు.

బాలల హక్కులు రక్షించాలి

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: పోలీసు శాఖతో పాటు సంబంధిత శాఖలు కోఆర్డినేషన్‌‌తో పనిచేసి బాలల హక్కులను సంరక్షించాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.  బుధవారం ఎస్పీ ఆఫీసులో బాలల సంరక్షణ చట్టాలపై వివిధ శాఖల అధికారులతో మీటింగ్ పెట్టి మాట్లాడారు. బాలల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్కూల్ స్థాయి నుంచే ప్రారంభం అవ్వాలన్నారు.  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్‌‌, కళా బృందాలతో  నిరంతరం అవగాహన కల్పిస్తున్నామన్నారు.  జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసర్ సంధ్యారాణి మాట్లాడుతూ నిందితులకు కఠినశిక్షలు పడితే మిగతా వాళ్లు భయపడతారన్నారు. ఏఎస్పీ రాములు మాట్లాడుతూ అపరేషన్ స్మైల్‌‌లో  176 మంది బాలలకు విముక్తి కల్పించామన్నారు.  జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ నయిమొద్దీన్, రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజు, డీఎస్పీలు మహేశ్, రమణారెడ్డి, మధు, ఆదినారాయణ పాల్గొన్నారు.

కోయిల్ సాగర్‌‌‌‌ ఒక గేటు ఎత్తివేత

దేవరకద్ర, వనపర్తి, వెలుగు: దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో ఆఫీసర్లు బుధవారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ముందు  రెండు గేట్లఎత్తిన ఆఫీసర్లు 20 నిమిషాల పాటు కొనసాగించారు. వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసి వేశారు. ప్రస్తుతం ఒక గేటు ద్వారా 1400 క్యూ సెక్కుల నీటిని  ఊక చెట్టు వాగులోకి వదులుతున్నారు. అలాగే వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సరళా సాగర్ ఆటోమెటిక్ సైఫన్లు మంగళవారం ఓపెన్‌‌ అయ్యాయి. రెండు ఉడ్ సైఫన్లు, ఒక మెయిన్ సైఫన్ నీరు దిగువకు వెళ్తుండడంతో సరళా సాగర్ వాగుపై ఆత్మకూరు, కొత్తకోట మధ్య ఉన్న రోడ్డు బ్రిడ్జి నీట మునిగింది. దీంతో అటువైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వీఆర్ఏలకు పేస్కేల్ ప్రకటించాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వీఆర్ఏలకు పేస్కేల్ ప్రకటించాలని వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం తెలకపల్లి తహసీల్దార్‌‌‌‌ ఆఫీస్‌‌కు వచ్చిన కలెక్టర్ ఉదయ్‌‌ కుమార్‌‌‌‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ గత అసెంబ్లీ సమావేశాల్లో హామీ ఇచ్చిన మేరకు వీఆర్ఏలకు పేస్కేల్, ప్రమోషన్లు, 55 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.  17 రోజులుగా నిరవదిక  సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, తెలకపల్లి మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్, అశోక్, రాము, బాలమ్మ, సాయి, సుల్తాన్ పాల్గొన్నారు. 

అలంపూర్ ఎస్సైని సస్పెండ్ చేయాలి

గద్వాల టౌన్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిసిన సీపీఐ నేత పెద్దబాబుకుపై అక్రమ కేసు పెట్టిన అలంపూర్ ఎస్సైని సస్పెండ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అనేక సంఘాలు, పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనలు తెలుపుతున్నాయని, కేవలం సీపీఐ లీడర్‌‌‌‌పైనే కేసు పెట్టి రిమాండ్‌‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. అలంపూర్ ఎస్సైపై హెచ్‌‌ఆర్సీతో పాటు డీజీపీకి  ఫిర్యాదు చేస్తామన్నారు ఈ ప్రెస్ మీట్‌‌లో గూడు సాబ్, వెంకటేశ్, కృష్ణ పాల్గొన్నారు. 

14 నుంచి జానపద కళాకారుల ప్రదర్శన

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 14 నుంచి జిల్లా కేంద్రంతో పాటు దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గ కేంద్రాల్లో జానపద కళాకారులతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్ రావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ  ఈ నెల 14న ఉదయం 10 గంటలకు జడ్పీ మైదానం నుంచి బాదం రామస్వామి ఆడిటోరియం వరకు ర్యాలీ, అనంతరం అక్కడ  జానపద నృత్యాలు, కోలాటం, డప్పుళ్లు, చెక్కభజన, బంజార నృత్యం, మహిళా కోలాటం తదితర జానపద  కళల ప్రదర్శన ఉంటుందన్నారు.   అలాగే ఈ నెల 11న ఉదయం 7 గంటలకు జడ్పీ మైదానం నుంచి బీఈడీ కాలేజీ గ్రౌండ్ వరకు ఫ్రీడం రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు.  ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చీఫ్‌‌ గెస్టుగా హాజరవుతారని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని కోరారు.