- మార్కెట్లో నిలువు దోపిడీ
- తరుగు పేరిట 10 కిలోల వరకు కోత
- కనుమరుగవుతున్న కొల్లాపూర్మామిడి
నాగర్‌కర్నూల్, వెలుగు: ఫలాల్లో రారాజుగా ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్మామిడి మెల్లగా కనుమరుగవుతోంది. ఏటా తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం, తెగుళ్లు ఇతర కారణాలతో దిగుబడి రావడం లేదు. దళారుల దోపిడీ, గిట్టుబాటు ధర రాకపోవడంతో ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తోటలను రైతులు నరికేస్తున్నారు. కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలో మొదలైన నరికివేత ఇప్పుడు మండలంలోని ఇతర గ్రామాలతోపాటు పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలకు పాకుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్..
వందేళ్ల కిందట కొల్లాపూర్ సంస్థానాధీశులు కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని (రాజుగారి) పెద్దతోట, చుక్కాయిపల్లి క్రిష్ణ విలాస్‌లో మామిడి తోటల సాగును ప్రారంభించారు. క్రమంగా తోటలు500 హెక్టార్ల వరకు విస్తరించాయి. ఏపీలోని కృష్ణా జిల్లా నూజివీడు నుంచి తెచ్చిన మామిడి మొక్కలు.. కొల్లాపూర్ ప్రాంతం నేల, వాతావరణంలో కాయలు నాణ్యంగా మంచి పరిమాణంతో పెరిగి తీపిగా, ఆకర్షణీయంగా ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మంచి పేరు, డిమాండ్వచ్చింది. ప్రస్తుతం కొల్లాపూర్ నియెజకవర్గంలో 25 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రత్యక్షంగా సుమారు 15 వేల మంది రైతులు, పరోక్షంగా వేలాది మంది మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు.
రైతుల కష్టాలు అన్నీఇన్ని కావు..
ఆరుగాలం కష్టపడిన మామిడి కాపును కాపాడుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మొన్నటివరకు ఎండలు భయపెడితే ఇప్పుడు గాలివాన వంతైంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే లోకల్ దళారులు చెప్పిందే ధర అన్నట్లు మార్కెట్ నడుస్తోంది. బయటి నుంచి కొనుగోలుదారులను రానీయకుండా అడ్డుపడుతున్నారని రైతులు వాపోతున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కు తరలిస్తే అక్కడ ఫిబ్రవరిలో టన్నుకు రూ.1లక్ష వరకు పలికిన మామిడి ధర మార్చిలో రూ.80 వేలు, ఏప్రిల్ లో రూ.48వేల వరకు పడిపోయిందని లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం రూ. 35 వేలకు మించి ఇవ్వడం లేదంటున్నారు. పైగా తరుగు పేరిట 10 కిలోల వరకు కోత పెడుతున్నారు. కొల్లాపూర్ లో ఏర్పాటు చేస్తామన్న మామిడి మార్కెట్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు ఎలక్షన్ స్లోగన్లుగా మిగిలిపోతున్నాయే తప్ప ఏర్పాటు దిశగా ఎటువంటి అడుగులు పడడం లేదు. మామిడితోటకు నీరు, పురుగుల మందుల ఖర్చులు తడిసి మోపెడతవుతున్నాయి.
40 డిగ్రీలు దాటిన ఎండలతో కాయల రంగు మారకుండా ఉండేందుకు భారీగా ఖర్చు చేసి రైతులు ఫ్రూట్ కవర్ల వినియోగిస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చు తీసేస్తే తమకు ఏం మిగలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలకు ఎవరినో ఎందుకు అనాలని ఆవేదనతో తోటలను నరికేసుకుంటున్నారు.
11 బాక్సులకు రూ.8వేలు వచ్చింది
నాకు మూడు ఎకరాల మామిడితోట ఉంది. ఇందులో 200 చెట్లు పెట్టినం. నాలుగు రోజుల కింద 11 బాక్సుల కాయలు(230 కిలోలు) పెద్దకొత్తపల్లికి తీసుకుపోతే రూ.8 వేలు మాత్రమే వచ్చినై. బండి కిరాయి రూ.4 వేలు మీద పడతాయని అగ్వకని తెలిసినా అమ్ముకున్న. తరుగు అని 23 కిలోలు తీసుకున్నారు. మార్కెట్రేట్ ప్రకారం అయితే రూ.16 వేల పైనే రావాలి. కూలీలకు ఇచ్చిన రూ.2 వేలు, తరుగు ఒక వెయ్యిపోతే నాకు మిగిలింది ఎంతనో ఇప్పటికి లెక్క తెలుస్తలేదు.
చీకిరాల పద్మ, మామిడి రైతు రాజాపూర్, కోడేరు మండలం