- పంట చేతికొచ్చే సమయంలో నీటి పాలు
- ఇంతకుముందు వరదలు.. ఇప్పుడు తుఫాన్
- ఆగమవుతున్న అన్నదాతలు.. ఆదుకోవాలని వేడుకోలు
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు : మిగ్ జాం తుఫాన్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చేతికొచ్చిన పంట నీటిపాలవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అకాల వర్షాలతో ఎక్కువగా మిరప, పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే బొబ్బ తెగులుతో మిరప తోటలు నాశనం అయ్యామయి. దూది చేతికొచ్చే టైమ్‌లో వానలు పడడంతో పత్తి చేన్లు కూడా పాడవుతున్నాయి. వరి చేలు ఒరిగి పోగా, కల్లాల్లో ధాన్యం తడకుండా ఉండేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు.
మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా అశ్వారావుపేటలో 140.3 మిల్లీ మీటర్లు, మధిరలో 98.3 , వేంసూరు, సత్తుపల్లిలో 92.8, దమ్మపేటలో 88.8, చింతకానిలో 76.3, బోనకల్ లో 74, ములకలపల్లిలో 55.3, చండ్రుగొండలో 51.5, భద్రాచలంలో 48 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ముసురుతో జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో ఓపెన్‌కాస్ట్ గనుల్లో. దాదాపు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.
అప్పుడు వరదలు.. ఇప్పుడు తుఫాన్..
జులై, ఆగస్టు నెలల్లో గోదావరికి వచ్చిన వరదల కారణంగా వాగులు, నదీ పరివాహకంలోని నల్లరేగడి నేలల్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలు నీటమునిగాయి. మిరప నార్లు ముదిరిపోవడంతో బయట ప్రాంతంలో ఒక్కో మొక్కను రూ.5ల చొప్పున కొనుగోలు చేసి ఆలస్యంగా నాటారు. పత్తి కూడా ఆలస్యంగా సాగు కావడంతో ఇప్పుడిప్పుడే కాయలు పగిలి దూది వస్తోంది. వరి కోతలు కొన్ని చోట్ల పూర్తి కాగా, మరి కొన్ని చోట్లు జరగాల్సి ఉంది. మిరప మొక్కలు ఆలస్యంగా సాగు చేయడం అనుకూలించక అధిక వేడికి బొబ్బ తెగులు వచ్చి ఎక్కడికక్కడ చనిపోయాయి.
భారీ నష్టం వచ్చినా మిగిలిన మొక్కలనే కాపాడుకుంటూ వస్తున్నారు. అనూహ్యంగా ఇప్పుడు మిగ్జాం తుఫాన్ రావడంతో ఉన్న మొక్కలు ఒరిగిపోవడంతో పూత, కాయలు రాలిపోతున్నాయి. వాన నీళ్లలో మిరప తోటలు మునిగిపోయాయి. అకాల వర్షాల వల్ల మరిన్ని తెగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి కారిపోవడంతో రంగు మారి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి కన్పించడం లేదని వాపోతున్నారు. తడిసిన ధాన్యం అమ్మడానికి కూడా కష్టమేనని ఆగమాగం అంటున్నారు.
నేడు, రేపు వ్యవసాయ మార్కెట్ కు సెలవు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు మిచౌంగ్ తుఫాన్ కారణంగా వర్తక సంఘం సభ్యుల కోరిక మేరకు బుధ, గురువారాలు సెలవు ప్రకటిస్తున్నట్లు గ్రేడ్ వన్ సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకురావద్దని చెప్పారు. గుమస్తాలు, హామీలు, వ్యాపారులు పనుల నిమిత్తం రావద్దని సూచించారు.
రెస్క్యూ బోట్స్ సిద్ధం
ఖమ్మం టౌన్,వెలుగు : భారీ వర్షాల సహాయక చర్యలకు రెండు ఇంఫ్లాటెడ్ రెస్క్యూ బోట్స్ విత్ అవుట్ బోట్ మోటార్స్ సిద్ధం చేశారు. ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ ప్రత్యేక చొరవతో జిల్లాలో విపత్తుల సమయంలో సత్వర సహాయక చర్యలకు ఒక్కొక్కటి రూ. 6 లక్షలతో రెండు కొనుగోలు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో 20 మందికి బోట్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కో బోట్ ఎనిమిది మందిని క్యారీ చేస్తుంది. ప్రస్తుత భారీ వర్షాల నేపధ్యంలో సత్తుపల్లి, మధిర లలో ఈ బొట్లు, సిబ్బందితో సహా సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఆశలు అడియాశలయ్యాయి..
పంటలపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. మొన్న గోదావరి వరదల వల్ల పంటల సాగు ఆలస్యమైంది. వర్షాలు లేకపోయినా కష్టపడి పంటలను కాపాడుకుంటూ వచ్చాం. పంట చేతికొచ్చే సమయానికి ఇప్పుడు తుఫాన్ వచ్చి ఆగమాగం చేస్తోంది. తెగుళ్లు వచ్చి మిరప తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఉన్న తోటలు ఈ తుఫాన్ వల్ల దెబ్బతింటున్నాయి.
బొల్లోజు రవికుమార్, సీతారాంపురం, దుమ్ముగూడెం