జగిత్యాలలో మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని రైతుల రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు : కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ఇప్పటికే క్వింటాల్​ధాన్యానికి ఆరు కిలోలు తరుగు తీస్తున్నా సరిపోవడం లేదని అదనంగా ఒక్కో లారికీ 25 నుంచి ముప్పై బస్తాలు కటింగ్ చేస్తున్నారని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం చౌలమద్ది రైతులు నేషనల్  హైవే 63 పై రాస్తారోకో చేశారు. మిల్లర్లపై చర్యలు తీసుకొని తరుగు పేరిట కట్ చేసిన ధాన్యం బస్తాల పైసలు ఇప్పించాలని నినదించారు. సుమారు గంటకు పైగా రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి తరుగు పేరిట కటింగ్ చేసిన ధాన్యం డబ్బులు ఇప్పించే వరకు రోడ్డుపైనే కూర్చుంటామని తేల్చి చెప్పారు. సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ సుధాకర్​వచ్చి రైతులను సముదాయించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు వాగ్వాదం చోటు చేసుకుంది. తర్వాత ఆర్డీఓ వినోద్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు. రైతులు మాట్లాడుతూ తేమ, తప్ప, తాలు పేరిట ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తరుగు తీస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తూకం టైంలో క్వింటాల్​కు ఆరు కిలోల వరకు తరుగు తీస్తుండడం, మిల్లుకు వెళ్లిన తర్వాత ఒక్కో లారీకి 25 నుంచి 30 సంచులు  అదనంగా తరుగు తీస్తుండడంతో నష్టపోతున్నామన్నారు. మిల్లర్లు 40 కిలోల బస్తాకు  మూడు కిలోల వరకు తేమ, తాలు పేరిట తరుగు తీస్తున్నారని వాపోయారు. తరుగు పేరిట దగా చేస్తున్న మిల్లర్ల పై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి ఆర్డీఓ వినోద్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు.  

క్వింటాల్​కు 4 కిలోలు ఎక్కువ జోకిన్రు

మెట్ పల్లి ఏఎంసీ మార్కెట్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మడానికి తీసుకువచ్చిన. నవంబర్ 28 న కాంటా చేసిన్రు. తరుగు పేరిట క్వింటాలుకు 4 కిలోలు ఎక్కువ జోకిన్రు. 541 సంచులు లారీల్లో రైస్ మిల్లులకు పంపించా. వారం తర్వాత లారీకి 20 బస్తాలు అదనంగా కట్​ చేశారని చెప్పాడు. మిల్లర్లపై చర్యలు తీసుకొని డబ్బులు ఇప్పించాలే. 
– పుడుకారం వెంకటేశ్, రైతు, చౌలమద్ది

ముప్పై బస్తాలు కట్ చేస్తున్నరు 

గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మకానికి తీసుకుపోయా. రెండు వారాల క్రితం 400 సంచులు తూకం వేశారు. ఒక్కో సంచికి 40 కిలోలు వేయాల్సి ఉండగా 42.5 కిలోలు, క్వింటాలుకు 5 కిలోలు తరుగు పేరిట ఎక్కువ తూకం వేశారు. మిల్లుకు వెళ్లాక 28 సంచులు అదనంగా కట్ చేసినట్లు చెప్పారు. ఆఫీసర్లు కోతలు లేకుండా డబ్బులు అందేలా చూడాలి.
– గడ్డం నర్సారెడ్డి,  రైతు, చౌలమద్ది