మహబూబాబాద్, వెలుగు : చెరువు కట్ట పక్కన, తూముల ముందున్న పొలాలు గతంలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయేవి. రెండు పంటలు పండే అలాంటి పొలాలను కొనేందుకు చాలా మంది ముందుకు రావడంతో వాటికి ఫుల్ డిమాండ్ ఉండేది. కానీ కొన్ని రోజులుగా పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ప్రస్తుతం చెరువుల్లో ఎప్పుడు చూసినా నీరు ఉంటుండడంతో పక్కన ఉన్న పొలాల్లో ఊటలు వస్తున్నాయి. వీటి కారణంగా దుక్కి దున్ని, వరి నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మహబూబాద్ జిల్లాలో ఐదారేళ్లుగా వందల ఎకరాల పొలాలు పడావుపడ్డాయి. వీటిని అమ్ముదామని ప్రయత్నించినా ఆ పొలాల వైపు ఎవరూ కన్నెత్తికూడా చూడడం లేదు.
జిల్లాలో 403 చెరువులకు ఎస్సారెస్పీ జలాలు
మహబూబాబాద్ జిల్లాలోని 403 చెరువులను ఎస్సారెస్పీ స్టేజ్ – 1, స్టేజ్ – 2 ప్యాకేజీ జలాలతో నింపుతున్నారు. జిల్లాలోని బయ్యారం, కొత్తగూడ, గంగారం, గార్ల మండలాలు మినహా మిగిలిన మండలాల్లోని అన్ని చెరువుల్లో ఎప్పుడు చూసినా నీరు నిల్వ ఉంటుంది. మిగిలిన 1,191 చెరువులకు మాత్రం వర్షమే ఆధారం.
పెద్ద చెరువుల కింద 100 ఎకరాలకు పైనే పడావు
ఒకప్పుడు చెరువు కట్ట పక్కన రెండు పంటలు పండిన పొలాలు నేడు పడావు పడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మాటేడు పెద్దచెరువు కింద సుమారు 700 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువులో నిత్యం నీరు ఉంటుండడంతో కట్ట పక్కన ఉన్న సుమారు 100 ఎకరాల్లో నీటి ఊటలు వస్తున్నాయి. దీంతో ఆ భూములన్నీ పడావు పడ్డాయి. కొందరు రైతులు సాహసం చేసి ట్రాక్టర్లతో పొలాలను దమ్ము చేసేందుకు ప్రయత్నించగా మూడు ట్రాక్టర్లు కూరుకుపోయాయి. దీంతో వాటిని భారీ క్రేన్ల సాయంతో బయటకు లాగాల్సి వచ్చింది. ఇలా పెద్ద చెరువు పక్కన సుమారు 100 ఎకరాలు, చిన్న చెరువుల పక్కన 20 నుంచి 50 ఎకరాల భూములు పడావు ఉంటున్నాయి. దీంతో ఆ భూముల్లో పిచ్చిమొక్కలు, గడ్డి పెరిగిపోతోంది. అయితే అలాంటి పొలాల్లో చేపల చెరువులు చేసుకోవాలని ఆఫీసర్లు సలహా ఇస్తున్నారు. కానీ దానిపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఎవరూ ముందుకు రావడం లేదు.
సాగు చేయలేకపోతున్నాం
చెరువు కట్ట పక్కన, తూము తెరువంగనే నీళ్లు వచ్చే పొలాలంటే గతంలో మస్త్ డిమాండ్ ఉండేది. ఎకరం రూ. 30 లక్షల వరకు పలికేది. కానీ ప్రస్తుతం మాటేడు పెద్ద చెరువు నిండా నీళ్లు ఉన్నా మాకున్న మూడు ఎకరాల్లో నాటు వేసే పరిస్థితి లేదు. పొలంలో తుంగ విపరీతంగా పెరిగిపోయింది. అమ్ముకుందామంటే ఎవరూ కొంటలేరు.
ఎన్.శారద, మహిళా రైతు, మాటేడు