శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదంలో చిక్కుకున్నారు. ఉగ్రవాదుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఉగ్రవాదులను అంతమొందించడానికి బదులుగా ప్రాణాలతో పట్టుకోవాలని ఆయన సూచించడం పెను దుమారం రేపింది. ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుంటే బుద్గామ్లో జరిగిన కాల్పుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ను కనిపెట్టొచ్చని ఆయన సూచించారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ఈ ఉగ్ర కాల్పులు జరిగాయేమోనని అనుమానంగా ఉందని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
వలస కార్మికులపై జరిగిన ఈ కాల్పుల ఘటనపై విచారణ జరపాలని, టెర్రరిస్టులను ప్రాణాలతో పట్టుకుంటే ఈ ఉగ్రదాడుల వెనుక ఎవరున్నారో విచారణ జరిపి తెలుసుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏదైనా ఏజెన్సీ ఈ కుయుక్తులకు పాల్పడుతుందేమోననే కోణంలో తామూ విచారణ చేస్తామని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జమ్ము కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో యూపీకి చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. కశ్మీర్ వ్యాలీలో అమాయకులైన వలస కార్మికులపై గత రెండు వారాల్లో నాలుగు సార్లు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్మూకాశ్మీర్లోని గందర్ బాల్ జిల్లా గగాంగిర్ వద్ద టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయిన ఘటన ఉగ్రమూకల దుశ్చర్యకు అద్దం పట్టింది. మృతుల్లో ఒక డాక్టర్, ఐదుగురు వలస కార్మికులు ఉన్నారు. గుండ్ ప్రాంతంలో సొరంగాన్ని నిర్మించే పనిలో కార్మికులు ఉండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ అటాక్లో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.