- వరంగల్లు దర్రీతో ఫ్యాషన్ బట్టలు
- ‘జేడీ డిజైన్ అవార్డ్-2023’లో దర్రీ డ్రెస్సులే విన్నర్
- 25 రోజుల పాటు మగ్గంపై నేసిన చేనేతలు
- కొత్తవాడలో సరికొత్త రంగులు, డిజైన్లతో క్లాత్ రెడీ
- డోర్ మ్యాట్ క్లాత్‍తో డ్రెస్సులు తయారు చేసిన ఫ్యాషన్ డిజైనర్స్
- సర్కార్ ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మస్తు డిమాండ్
వరంగల్, వెలుగు: ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓరుగల్లు చేనేతల దర్రీ (కార్పెట్) ఇప్పుడు సరికొత్తగా ఫ్యాషన్ రంగంలో తళుక్కుమంటోంది. దర్రీలను ఇన్నాళ్లు డోర్ మ్యాట్లు, బెడ్‍షీట్లు, జంపఖానాలు, డెకరేషన్ ఐటెంలుగా మాత్రమే నేసేవారు. ఈమధ్య వాటితో డిజైనర్లు వివిధ ఫ్యాషన్ డ్రెస్సులు తయారు చేశారు. వాటిని ధరించి ఫ్యాషన్ పరేడ్ చేసిన టీమ్‌కు ఏప్రిల్ 28న ‘జేడీ డిజైన్ అవార్డ్’ దక్కడం ఫ్యాషన్ రంగంలో అందరి దృష్టిని ఆకర్షించింది.
దర్రీపై ఫ్యాషన్ డిజైనర్ల నజర్..
హైదరాబాద్‍కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్లు అనుముల మెర్సీ, మన్వితా రావు లేటెస్ట్ డిజైన్లతో ఫ్యాషన్ రంగంలో గుర్తింపు పొందాలనుకున్నారు. ఇప్పటివరకు ఉన్న డిజైన్లకు డిఫరెంట్‍గా ఉండే విధంగా వరంగల్ దర్రీలతో డ్రెస్సులు తయారుచేయాలని భావించారు. వరంగల్‍కు చెందిన చిప్ప కిరణ్ కుమార్ ద్వారా కొత్తవాడలోని ‘అవర్ వీవర్స్ హౌజ్’ చేనేత కార్మికులు సాంబయ్య, రమేశ్‍ను కలిశారు. తమకు ఎలాంటి దారంతో క్లాత్ కావాలో చెప్పారు. వారు 25 రోజులు కష్టపడి మెర్సీ, మన్వితా చెప్పినదానికంటే బెస్ట్ కలర్స్, దానిపై డిజైన్లు ఇచ్చారు. తర్వాత వాటిని మేల్ అండ్ ఫిమేల్ మోడల్స్‌కు సూట్ అయ్యేలా కొత్త డిజైన్లలో తయారు చేశారు.
‘ది బెస్ట్ ఇన్నోవేషన్ కలెక్షన్’ అవార్డ్..
ఫ్యాషన్ డిజైన్ రంగంలో పేరున్న జేడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ‘జేడీ డిజైన్ అవార్డ్–2023’ కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‍లోని జేఆర్‍సీ కన్వెన్షన్ హాల్‍లో నిర్వహించారు. ఈ క్రమంలో మెర్సీ, మన్విత ఓరుగల్లు చేనేతలు దర్రీతో రూపొందించిన డ్రెస్సులను తమ టీమ్ ద్వారా ప్రదర్శించారు. వరల్డ్ వైడ్‌గా వాతావరణం, ట్రెడిషన్ ఆధారంగా లేటెస్ట్ ఫ్యాషన్ లుక్ ఉండడంతో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మిగతా 17 టీమ్‌లను కాదని దర్రీ డ్రెస్సులకు ‘ది బెస్ట్ ఇన్నోవేషన్ కలెక్షన్’ అవార్డ్ దక్కింది. మెర్సీ, మన్వితలకు నిర్వాహకులు, ఫ్యాషన్ జడ్జిలు నీలేశ్ దలాల్, వెంకటేశ్, ఫరా ఫాతిమా అవార్డు అందించారు. చేనేత రంగంలో ఏండ్ల తరబడి చేస్తున్న వస్త్రాలు కాకుండా కొత్తగా నేసిన డ్రెస్ క్లాత్‍లు ఫ్యాషన్ రంగాన్ని ఆకట్టుకోవడంతో వరంగల్ చేనేతలు హ్యాపీగా ఫీలయ్యారు. ఇట్లనే డిజైనర్లు ముందుకు రావడానికితోడు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే ఓరుగల్లు దర్రీకి ఫ్యూచర్లో మంచి డిమాండ్ వస్తుందని చేనేత కార్మికులు చెబుతున్నారు.
చలి ప్రాంతాల్లో డిమాండ్ ఉంటది
ప్రపంచ ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఇప్పుడున్న డ్రెస్సులు, మోడల్స్ కాకుండా సరికొత్తగా రూపోందించాలని భావించాం. అప్పుడు మిగతా క్లాత్‍లతో పోలిస్తే మందంగా, డిఫరెంట్‍గా ఉండే వరంగల్ దర్రీ క్లాత్ గుర్తొచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి చేనేతలతో మాట్లాడి మాకు కావాల్సిన విధంగా తయారు చేయించాం. మేం అనుకున్న స్టైల్లో వాటిని స్టిచ్ చేశాం. అనూహ్యంగా మాకే ఈ ఏడాది బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. కాగా, ఇప్పుడు అందరి దృష్టి ఈ దర్రీలపై పడే అవకాశం ఉంది. ప్రధానంగా చలి ఎక్కువగా ఉండే దేశాల్లో వీటికి డిమాండ్ ఉంటుంది.
- అనుముల మెర్సీ , ఫ్యాషన్ డిజైనర్
మా దగ్గరే తయారుచేయించుకున్నరు..
మూడు నెలల కింద నలుగురైదుగురు డిజైనర్ స్టూడెంట్లు వరంగల్ వచ్చారు. కొత్తవాడలో తాము నడుపుతున్న ‘అవర్ వీవర్స్ హౌజ్’ దర్రీలను పరిశీలించారు. డోర్ మ్యాట్లు, ఫ్లోర్స్ మ్యాట్స్ కాకుండా వారికి లేటెస్ట్ మోడల్స్, రంగుల్లో క్లాత్ కావాలని అడిగారు. మంచి డిజైన్లతో వారడిగిన దర్రీ క్లాత్‍ను నెలలో అందించాం. ఫ్యాషన్ డిజైన్ పోటీల్లో మేం నేసిన దర్రీలకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం సైతం దీనిపై దృష్టి పెడితే భవిష్యత్తులో మాకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది.
- చిప్ప వెంకటేశ్వర్లు , రాష్ట్ర పద్మశాలీ చేనేత విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్