
హైదరాబాద్, వెలుగు: నగరంలోని ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎమ్మెస్కేఎస్‌ఐసీఏ) ఓల్డ్ సిటీలో నిరుపేద క్రికెటర్ల కోసం ఫాస్ట్ బౌలింగ్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. బుధవారం ఆరాంఘర్‌లోని విజయానంద్ గ్రౌండ్స్‌లో ‘మన తదుపరి సిరాజ్ ఎవరు?’ అనే ట్యాగ్‌లైన్ తో నిర్వహించిన ఈ ట్రయల్స్‌లో దాదాపు 400 మంది ఔత్సాహిక క్రికెటర్లు పాల్గొన్నారు. బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ ట్రయల్స్‌ను ప్రారంభించారు.
ఈ ట్రయల్స్ ద్వారా ప్రతిభావంతులను గుర్తించి తన అకాడమీలో ఉచిత శిక్షణ అందించడానికి ముందుకు వచ్చిన ఎమ్మెస్కేను అసదుద్దీన్ అభినందించారు. సిరాజ్ మాట్లాడుతూ తన కెరీర్ తొలినాళ్లలో బూట్లు కూడా కొనలేక ఇబ్బంది పడేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఎమ్మెస్కే ప్రసాద్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని యంగ్ క్రికెటర్లకు సూచించాడు.
ప్రతిభావంతులైన, పేద పిల్లలను వెలుగులోకి తీసుకురావడానికి నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని ఎమ్మెస్కే చెప్పాడు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జనరల్ సెక్రటరీ ముజీబ్, ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్లు షాబుద్దీన్, ఫసీర్ రెహ్మాన్, ఏసీఏ– సీఏసీ మాజీ చైర్మన్ సత్య ప్రసాద్, పలువురు క్రికెటర్ల పాల్గొన్నారు.