- నెలాఖరు వరకు సెంటర్లు క్లోజ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయి. అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) ఎమోతీలాల్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కొనుగోళ్లను స్పీడప్ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. జిల్లావ్యాప్తంగా 286 సెంటర్లను ఓపెన్ చేయగా, ప్రస్తుతం 254 రన్నింగ్ లో ఉన్నాయి.
మంచిర్యాల నియోజకవర్గంలో కొనుగోళ్లు పూర్తిచేసిన 32 సెంటర్లను క్లోజ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం సెంటర్లకు వచ్చింది. ఇందులో 78 వేల మెట్రిక్ టన్నులు కొన్నారు. మొత్తం విలువ రూ.172 కోట్లకు గాను 4,835 మంది రైతులకు రూ.70 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.81.42 కోట్లు ట్యాబ్ ఎంట్రీ పెండింగ్ ఉంది. ఎంట్రీ పూర్తికాగానే నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈసారి తూకంలో మోసాలు, తరుగు పేరుతో కటింగ్ లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
ఎప్పటికప్పుడు రవాణా..
గతంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ట్రాన్స్పోర్టేషన్ ప్రధాన సమస్యగా ఉండేది. ఈసారి అడిషనల్ కలెక్టర్ చొరవతో ఆ సమస్యను అధిగమించారు. ఇప్పటివరకు 71 వేల 700 మెట్రిక్ టన్నుల వడ్లను మిల్లులకు తరలించారు. ఇంకా 6,390 మెట్రిక్ టన్నులు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లాలోని రైస్ మిల్లులకు లక్ష మెట్రిక్ టన్నులు, పెద్దపల్లి జిల్లాలోని మిల్లులకు 50 వేల మెట్రిక్ టన్నులు కేటాయించారు.
నెలాఖరు వరకు కొనుగోళ్లు పూర్తి
మే నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో కొనుగోళ్లను వేగవంతం చేశామన్నారు. తడిసిన ధ్యాన్యాన్ని సైతం కొంటామని చెప్పారు. గతంలో జూన్ 15 వరకు కొనుగోళ్లు జరిగాయని చెప్పారు. ఈసారి మే నెలాఖరులోపే సెంటర్లను క్లోజ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.