మెడికల్​ కాలేజీ హాస్టళ్లకు.. తాత్కాలిక బిల్డింగ్​లు రెడీ

మెడికల్​ కాలేజీ హాస్టళ్లకు.. తాత్కాలిక బిల్డింగ్​లు రెడీ
  • వచ్చే నెలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

జనగామ, వెలుగు: గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సౌకర్యాల కల్పనకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గతేడాది ప్రారంభమైన జనగామ కాలేజీలో తొలి యేడాది 100 మంది స్టూడెంట్లు అడ్మిషన్లు పొందగా, చంపక్ హిల్స్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్​ నెలలో ఫస్ట్ ఇయర్ కోసం 100 మంది స్టూడెంట్ల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో తాత్కాలిక భవనాల కేటాయింపు కోసం కొన్ని నెలలుగా కొనసాగుతున్న కసరత్తులు పూర్తయ్యాయి. ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు రెసిడెంట్ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 

హాస్టల్ కోసం సుశీలమ్మ ఫౌండేషన్ బిల్డింగ్..​

స్టూడెంట్ల భద్రత నేపథ్యంలో హాస్టళ్ల ఎంపికపై మెడికల్ కాలేజీ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గర్ల్స్ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిద్దిపేట రోడ్డులో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన సుశీలమ్మ ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని గర్ల్స్ కు కేటాయించారు. ఈమేరకు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గోపాల్ రావు, జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ పార్థసారధి, సీఐ దామోదర్ రెడ్డి ఇటీవల వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. భద్రతా ప్రమాణాలపై ఆరా తీశారు. బాయ్స్ కోసం చంపక్ హిల్స్ వద్దే ఉన్న డీఆర్​డీఏ బిల్డింగ్ తోపాటు మాతృ దర్శన్ ట్రస్ట్​ బిల్డింగ్ ను ఉపయోగించనున్నారు.  

కొనసాగుతున్న బిల్డింగ్ పనులు..

జిల్లా కేంద్రం శివారు సిద్దిపేట రోడ్డులోని ఎంసీహెచ్ బిల్డింగ్ పక్కన తాత్కాలిక షెడ్లలో ప్రస్తుతానికి మెడికల్ కాలేజీ రన్ చేస్తున్నారు. పక్కా బిల్డింగ్​ కోసం ఇదే రోడ్డులో గీతాశ్రమం సమీపంలో 18 ఎకరాలలో, రూ.200 కోట్లతో పనులు చేపడుతున్నారు. అయితే పనులు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్ పూర్తయితే మెడికల్ కాలేజీకి సొంత భవనం రానున్నది.


సౌలతులకు చర్యలు..

అక్టోబర్​ నెలలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. స్టూడెంట్లకు ఇబ్బంది లేకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నం. మెడికల్ కాలేజీ పక్కా బిల్డింగ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాలేజీలో ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్​ వేశాం. దరఖాస్తుదారుల అప్లికేషన్ల పరిశీలన అనంతరం ఖాళీలు భర్తీ చేస్తాం.  - గోపాల్ రావు, జనగామ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్