- ఇప్పటివరకూ 13.13 లక్షల టన్నులు కొన్నం
- సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ వెల్లడి
- రైతులకు 1,560 కోట్లు చెల్లింపు
- సన్నాలకు బోనస్ రూ. 9.21 కోట్లు ఇచ్చినం
- డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలే
హైదరాబాద్, వెలుగు: నిరుడి కంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ తెలిపారు. కొనుగోలు సెంటర్లలో 1.88 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,045.76 కోట్ల విలువైన 13.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే రైతులకు రూ.1,560.70 కోట్ల చెల్లింపులు చేసినట్టు వివరించారు. నిరుడు ఇదే టైమ్‌కు 12.45లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరగ్గా, ఈ యేడు నిరుడు కంటే అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పారు.
సోమవారం హైదరాబాద్‌లో డైరెక్టర్ ప్రసాద్ తో కలిసి చౌహాన్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఈ సారి రికార్డు స్థాయిలో 1.50 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందని, ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 8,066 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. సర్కారు సన్న రకాలకు రూ.500 బోనస్ ప్రకటించిన నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేకంగా 4 వేల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి స్టేట్ పూల్ ద్వారా వచ్చే ఉగాది నుంచి రేషన్ పంపిణీకి సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.
ఈ యేడు 36 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించాలని నిర్ణయించగా, వచ్చే 9 నెలల రేషన్ పంపిణీకి 27 లక్షల సన్న వడ్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. ఇప్పటికే 3.02 లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించి, రైతులకు బోనస్ రూపంలో మద్దతు ధరకు అదనంగా రూ.9.21 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు.
362 డిఫాల్టర్ మిల్లులకు చెక్
రాష్ట్రంలో 362 మంది రైస్‌మిల్లర్లు డిఫాల్టర్లుగా మారగా.. వీరికి ఒక్క గింజకూడా కేటాయించలేదని చౌహాన్ తెలిపారు. డిఫాల్టర్ల నుంచి రూ.3,200 కోట్ల విలువైన సీఎమ్మార్ రావాల్సి ఉన్నదని, రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో పాటు కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఆర్ఆర్ యాక్ట్ కింద రూ.40 కోట్లు, 77 క్రిమినల్ కేసులు నమోదు చేసి మొత్తంగా రూ.1,281 కోట్లు రికవరీ చేసినట్టు తెలిపారు. జీవో నంబర్11లో సవరణలు చేసి ప్రాపర్టీని అమ్ముకోకుండా చర్యలు చేపట్టామన్నారు.
అక్రమార్కులపై 402 కేసులు, 351 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. రూ.38.74 కోట్ల విలువైన48,129 క్వింటాళ్ల అక్రమ ధాన్యాన్ని సీజ్ చేసినట్టు చెప్పారు. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేవారికే ధాన్యం కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సబ్‌కమిటీ సభ్యులు చేసిన సిఫారసుల మేరకు సంస్కరణలకు అంకురార్పణ చేసినట్టు చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం చేశామని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 2.81లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కొత్త సంస్కరణలతో రాష్ట్ర సర్కారు అప్పుల భారాన్ని క్రమంగా తగ్గిస్తున్నట్టు చెప్పారు. 2014–2023 వరకు సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ కు రూ.58,623 కోట్ల అప్పులు ఉంటే గత పదేండ్లలో ప్రతి ఏటా రూ.5వేల కోట్లకు పైగా భారం పెరుగుతూ వచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు కేవలం ఏడాదిలోపే రూ.11,608.40 కోట్ల అప్పులు చెల్లించి, అప్పుల భారాన్ని రూ.47,014.68 కోట్లకు తగ్గించుకున్నట్టు వివరించారు.