షాన్ టైట్ To మయాంక్ యాదవ్.. IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లు వీరే

 షాన్ టైట్ To మయాంక్ యాదవ్.. IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన బౌలర్లు వీరే

టీ20 ఫార్మాట్ అనగానే అందరికి గుర్తొచ్చేది.. బ్యాటర్ల మెరుపులు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బ్యాటర్లు.. బౌండరీల కోసం తహతహలాడుతున్నారు. మంచి బంతిని సైతం బౌండరీకి తరలించి పరుగులు రాబడుతుంటారు. ఎంత వైవిద్యం ఉన్నప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటర్లదే పైచేయి. అలాంటి చోట నిలబడాలంటే, తమకంటూ గుర్తింపు ఉండాలంటే బౌలర్లలో ఏదో ఒక ప్రత్యేకత దాగుండాలి. అలా తమ పేస్‌ను ఆయుధంగా మలుచుకొని.. బ్యాటర్లను బెంబేలెత్తించడం ఫాస్ట్ బౌలర్ల స్పెషాలిటీ.  

వేగంగా బంతులు వేయడం ఏముందిలే అనుకోకండి.. నిలకడగా గంటకు 150 కి.మీకుపైగా వేగంతో బంతులు సంధించడం శ్రమతో కూడుకున్నదే. బ్యాటర్ల ఊహకు బంతి చిక్కకుండా మెరుపు వేగంతో దూసుకెళ్లేలా వేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు బౌల్ చేయబడిన టాప్ 10 వేగవంతమైన డెలివరీలను పరిశీలిస్తే.. ఆసీస్ పేసర్ షాన్ టైట్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

షాన్ టైట్: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి సంధించిన రికార్డు మాజీ ఆస్ట్రేలియన్ స్పీడ్‌స్టర్ షాన్ టైట్‌ పేరిట ఉంది. రాజస్థాన్ రాయల్స్ మాజీ పేసరైన షాన్ టైట్.. 2011లో ఢిల్లీ క్యాపిటల్స్ (గతంలో ఢిల్లీ ఢిల్లీ డేర్‌డెవిల్స్)తో జరిగిన మ్యాచ్‌లో 157.8 kmph వేగంతో బంతిని సంధించాడు. 

లాకీ ఫెర్గూసన్: న్యూజిలాండ్ పేసరైన ఫెర్గూసన్ మంచి ఫాస్ట్ బౌలర్. తన పేస్ కు బౌన్స్ జోడించి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. 2022 ఐపీఎల్ సీజన్‌లో ఫెర్గూసన్(గుజరాత్ టైటాన్స్).. రాజస్థాన్ రాయల్‌తో జరిగిన మ్యాచ్‌లో 157.3kmph వేగంతో బంతిని సంధించి ఐపీఎల్‌లో రెండో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.

ఉమ్రాన్ మాలిక్: జమ్మూ ఎక్స్ ప్రెస్ గా పేరొందిన ఉమ్రాన్ నిలకడగా 150కి.మీ వేగంతో బంతులు వేయగల సమర్థుడు. కాకపోతే, బౌలింగ్‌లో లైన్‌ అండ్‌ లెంగ్త్‌ ఖచ్చితత్వంతో వేయకపోవడంతో భారీగా పరుగులు సమర్పించుకునేవాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసరైన ఉమ్రాన్.. ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి తొలి ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 

అన్రిచ్ నోర్ట్జే: దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్జే పేరు చెప్తే.. బ్యాటర్లకు వెన్నులో వణుకే. పేస్ కు తోడు బౌన్స్ జోడించి.. బ్యాటర్ల శరీరంపైకి బంతులు విసరడం అతని ప్రత్యేకత. 2020 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 156.22 కిమీ వేగంతో బంతిని విసిరిన నార్ట్జే.. ఐపిఎల్ చరిత్రలో మూడో ఫాస్టెస్ట్ ఓవర్సీస్ బౌలర్.  

మాయంక్ యాదవ్: ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో మయాంక్ గంటకు 155.22 కి.మీ వేగంతో బంతి సంధించి ఎలైట్ జాబితాలో పేరు దక్కించుకున్నాడు. మున్ముందు అతను షాన్ టైట్ రికార్డు బద్దలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 

డేల్ స్టెయిన్: ఫాస్ట్ బౌలింగ్ ప్రపంచంలో లెజెండరీ పేసర్.. స్టెయిన్. ఈ జాబితాలో అతను కాస్త దిగువున ఉన్నా.. అతని బౌలింగ్ ను ఎదుర్కోవడం అంటే బ్యాటర్లకు ఇబ్బందికరమే. డెక్కన్ ఛార్జర్స్ మాజీ పేసరైన డేల్ స్టెయిన్ 2012 ఐపీఎల్ సీజన్‌లో 154.4 kmph వేగంతో బంతిని విసిరాడు. కెరీర్ చివరి దశల్లో గాయాలను ఎదుర్కొన్నప్పటికీ, అంత ఎక్కువ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం క్రికెట్ పై అతనికున్న మక్కువ.