చండీగఢ్: అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఖనౌరీ బార్డర్ వద్ద పంజాబ్‌కు చెందిన రైతు సంఘం నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చేపట్టిన నిరసన దీక్ష బుధవారానికి 16వ రోజుకు చేరుకున్నది. దల్లేవాల్ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ శంభు, ఖనౌరీ వద్ద పెద్ద సంఖ్యలో రైతులు ప్రత్యేక ప్రార్థనలు చేసి మద్దతు ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు నిరసన తెలియజేస్తున్నారు. కాగా, దీక్ష చేస్తున్న 70 ఏండ్ల దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నది.
రక్తంలో షుగర్ లెవల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి. 11 కిలోలు తగ్గిపోయారు. ఆయన హెల్త్ కండిషన్‌ను డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 26న ఆమరణ దీక్ష ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు పంజాబ్ పోలీసులు దల్లేవాల్‌ను ఖనౌరీ నుంచి బలవంతంగా తరలించారు. దల్లేవాల్ దీక్షకు మద్దతుగా గురువారం రాత్రి అందరూ డిన్నర్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని దల్లేవాల్ కోరారు. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు ప్రకటించారు.