ఆడిస్ అబాబా: ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు నదిలో పడిపోవడంతో 71 మంది చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ ఇథియోపియాలో సిడామా రాష్ట్రంలోని బోనా జూరియా వొరేడాలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రక్కు.. గెలాన్ బ్రిడ్జిపై నుంచి అదుపుతప్పి నదిలోకి పడిపోయింది. స్పాట్లో 64 మంది చనిపోగా.. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మిగతా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక పనులు చేపట్టారు. పోలీసులకు, అధికారులకూ సమాచారం అందించారు. నదిలో పడిన ట్రక్కును తాళ్లతో కట్టి అతికష్టం మీద బయటకు లాగారు. గాయపడిన వారిని సమీపంలోని బోనా జనరల్ హాస్పిటల్కు తరలించారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.