
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చలనా కోసం బైక్ ను ఆపడంతో ఒక వ్యక్తి మృతి చెందడం కలకలం రేపింది. పోలీసుల నిర్లక్ష్యానికి వ్యక్తి ప్రాణం పోయిందని వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ బాలానగర్ లో జరిగింది ఈ దారుణ ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న బైక్ ను పోలీసులు ఆపుతుండటంతో తప్పించుకునేందుకు ప్రయత్నించి అదుపుతప్పి బైక్ కింద పడింది. బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడటంతో ఊహించని ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తి తల పై నుండి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఘటన స్థలంలో అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందాడు.
►ALSO READ | ఏపీలో ఘోర అగ్నిప్రమాదం..బాణసంచా గోడౌన్లో పేలుడు..మంటల్లో నలుగురు సజీవ దహనం
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఇతర వాహన దారులు రోడ్డు పై ధర్నాకు దిగారు. తీంతో బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు వాహనదారులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది.
పోలీసుల నిర్లక్ష్యం వలన ఒక వ్యక్తి చనిపోయాడని, అతని కుటుంబ పరిస్థితి ఏంకావాలని వాదనకు దిగారు. రన్నింగ్ బైక్ ను ఆపడమేంటని ప్రశ్నించారు. అవసరమైతే సిగ్నల్ దగ్గర ఆపవచ్చు కదా అని ప్రశ్నలకు దిగారు. బైక్ ను ఆపకుండా ఫోటో తీసి చలాన్ వేయొచ్చుకదా.. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా.. దీనికి బాధ్యులు ఎవరని వాగ్వాదానికి దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని వాహనదారులను చెదరగొట్టారు.