ఘోర ప్రమాదం: క్రేన్ వైర్ తెగి ఐదుగురు కూలీల దుర్మరణం

ఘోర ప్రమాదం: క్రేన్ వైర్ తెగి ఐదుగురు కూలీల దుర్మరణం
  • నార్లాపూర్ పంప్‌‌హౌస్‌‌లో అర్ధరాత్రి తర్వాత ఘటన
  • ఉదయం దాకా బయటకు పొక్కనియ్యని ఆఫీసర్లు
  • సీక్రెట్‌‌గా ఉస్మానియాకు డెడ్​బాడీల తరలింపు
  • భారీగా పోలీసుల మోహరింపు
  • ఘటనాస్థలానికి మీడియా వెళ్లకుండా అడ్డగింత
  • కాంట్రాక్ట్ సంస్థ మేఘాపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్

నాగర్ కర్నూల్, వెలుగు: పాలమూరు-రంగారెడ్డి మొదటి ప్యాకేజీలోని నార్లాపూర్ పంప్‌‌హౌస్‌‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. క్రేన్ బకెట్ వైర్ తెగిపోయి కిందపడడంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఘటన జరిగితే శుక్రవారం ఉదయం దాకా విషయాన్ని ఆఫీసర్లు బయటకు పొక్కనియ్యలేదు. డెడ్​బాడీలను రహస్యంగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పంప్‌‌హౌస్‌‌కు వెళ్లే దారుల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఘటనాస్థలానికి వెళ్లకుండా ప్రతిపక్షాలు, మీడియాను అడ్డుకున్నారు. కాంట్రాక్ట్ సంస్థ మేఘా కంపెనీ నిర్లక్ష్యం వల్లే కార్మికులు చనిపోయారని ప్రతిపక్ష, ప్రజాసంఘాల లీడర్లు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ప్రమాదం బయటికి తెల్వొద్దని..

నార్లాపూర్ పంప్‌‌హౌస్‌‌లో గురువారం రాత్రి పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక ఆరుగురు కార్మికులను 150 మీటర్ల ఎత్తు నుంచి క్రేన్ బకెట్​ద్వారా కిందికి దింపుతుండగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో కార్మికులు పై నుంచి కిందికి పడిపోయారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన శ్రీను(40), జార్ఖండ్‌‌కు చెందిన భోలేనాథ్(45), ప్రవీణ్ (38), కమలేశ్ (36), బీహార్‌‌‌‌కు చెందిన సోను కుమార్ (36) అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలు కాగా.. ట్రీట్‌‌మెంట్ కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించిన సమాచారం బయటికి రాకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. నార్లాపూర్ పంపుహౌస్‌‌కు వెళ్లేదారులన్నీ మూసేశారు. శుక్రవారం సైట్‌‌లో పనులను నిలిపివేశారు. కాంట్రాక్ట్ కంపెనీ ఉద్యోగులు వాహనాల్లో సైట్​వద్ద తిరుగుతూ కార్మికులు షెడ్ల నుంచి బయటకు రాకుండా నియంత్రించారు.

ముందు నవయుగ తర్వాత మేఘా

నార్లాపూర్ రిజర్వాయర్, పంప్‌‌హౌస్‌‌ పనులు మొదట నవయుగ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. గత ఏడాది జనవరిలో వారి కాంట్రాక్ట్ రద్దు చేసి.. మేఘా కంపెనీకి అప్పగించింది. అప్పటికే అండర్ టన్నెల్ అప్రోచ్ కెనాల్ పనులు చేస్తున్న మేఘా కంపెనీకి ఈ పనులు కూడా అప్పగించడంతో పాలమూరు – రంగారెడ్డి మొదటి మూడు ప్యాకేజీలు ఆ కంపెనీకే దక్కినట్లు అయింది. పనుల్లో క్వాలిటీ లేకపోవడం, కార్మికుల సేఫ్టీకి చర్యలు తీసుకోకపోవడంపై ఇదివరకే విమర్శలు వెలువెత్తాయి. 

సేఫ్టీపై ముందే హెచ్చరించినా..

నార్లాపూర్ పంప్‌‌హౌస్‌‌ ప్రాంతాన్ని నేషనల్​ లేబర్ వెల్పేర్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు శుక్రవారం పరిశీలించారు. తొలుత అనుమతి లేదని ఆయన్ను పోలీసులు ఆపేశారు. నేషనల్ లేబర్ వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత పై నుంచి ఆదేశాలు రావడంతో ఆయనను అనుమతించారు. గత నెలలో తాను విజిట్ చేసినప్పుడు వలస కూలీల వివరాలు, సేఫ్టీ మెజర్స్‌‌పై హెచ్చరించినా పరిస్థితి మారలేదని మండిపడ్డారు. భారీ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు కూలీల రక్షణకు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. జూన్‌‌లో వచ్చినప్పుడు శ్రీనివాసులు వలస కూలీల వివరాలు అడిగితే కాంట్రాక్ట్ ఏజెన్సీ, ఇంజనీరింగ్ అధికారులు నీళ్లు నమిలారు. 15 రోజుల్లోగా వివరాలివ్వాలని పట్టించుకోలేదు. దీంతో ఇటీవలే బోర్డ్ నుంచి అధికారులకు నోటీసులు పంపినట్టు తెలిసింది. నార్లాపూర్​ పంపుహౌస్‌‌ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన 1,200 మంది వలస కార్మికులు పనిచేస్తుండగా.. 100 మంది వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు సమాచారం.

కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకోవాలె

ప్రమాదానికి కారణమైన కాంట్రాక్ట్​ ​సంస్థ మేఘాపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల లీడర్లు డిమాండ్​ చేశారు. శుక్రవారం ఉదయం బీజేపీ నాగర్​కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్​రావు, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తదితరులు ఘటన స్థలానికి చేరుకోగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే మీడియాతో మాట్లాడారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పర్వతాలు ఆధ్వర్యంలో ఘటన స్థలానికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను పెట్టి మేఘా కృష్ణారెడ్డిని కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పర్వతాలు విమర్శించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్ చేశారు. 

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి - బండి సంజయ్, ఈటల డిమాండ్

పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికుల మరణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ చనిపోయి, వారి కుటుంబాలు రోడ్డున పడడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా అందించాలని కోరారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.