- జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ వెల్లడి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జిజాన్ ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భారతీయులు చనిపోయినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ బుధవారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసింది.
బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. స్థానిక అధికారులతో పాటు భారత్ లోని అధికారులతో టచ్‌లో ఉన్నట్లు ఎక్స్ వేదికగా ఇండియన్ కాన్సులేట్ వెల్లడించింది. "సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం.
బాధిత కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధితులకు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ పూర్తి సహకారం అందిస్తోంది. ఇప్పటికే భారత్ లోని అధికారులుతో, బాధిత కుటుంబాలతో టచ్‌లో ఉన్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.
మరిన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్స్ ఏర్పాటు చేశాం" అని పేర్కొంది. ఈ ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. ప్రమాదంలో భారత పౌరుల మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఏయే ప్రాంతాలకు చెందినవారనే వివరాలను మాత్రం ఇండియన్ కాన్సులేట్ ఇప్పటిదాకా పేర్కొనలేదు.