నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న పడవ నైజర్ నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో 100 మందికి పైగా నదిలో గల్లంతయ్యారు. నీటిలో తప్పిపోయిన వారిలో అత్యధికంగా మహిళలే ఉన్నట్లు సమాచారం. శుక్రవారం (నవంబర్ 29) తెల్లవారుజామున కోగి రాష్ట్రం నుండి పొరుగున ఉన్న నైజర్‌కు పడవ ప్రయాణీకులను తీసుకెళ్తోన్న సమయంలో ఈ ఘటన జరిగిందని నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రతినిధి ఇబ్రహీం తెలిపారు.
ప్రమాదానికి గురైన పడవ ప్రయాణికులను స్థానిక ఫుడ్ మార్కెట్‌కు తరలిస్తుందని చెప్పారు. ప్రమాద సమయంలో పడవలో 200 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదానికి స్పష్టమైన కారణం తెలియనప్పటికీ.. ఓవర్ లోడే రీజన్ అని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, నైజీరియాలో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అక్కడి ప్రజలు ట్రాన్స్‌పోర్టుకు ఎక్కువగా పడవలను ఆశ్రయిస్తారు. ఇదే అదునుగా భావించే పడవ ఓనర్లు పరిమితికి ప్రయాణికులను తీసుకెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో నైజీరియాలో ఇలాంటి పడవ ప్రమాదాలు సాధారణమైపోయాయి.