జైపూర్: క్రిస్మస్ పండుగ వేళ రాజస్థాన్‌లోని కరౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు కారును ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహయంతో కారు, బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, వడోదరకు చెందిన కొందరు కారులో రాజస్థాన్‌లోని కైలాదేవిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా వీరి కారును కరౌలి గంగాపూర్ రోడ్డులో బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. మృతులను నయన్ కుమార్ దేశ్ ముఖ్, అనిత, మనస్వి, ఖుష్దేవ్, ప్రీతి భట్‌గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. బస్సులోని 15 మంది ప్రయాణికులు గాయపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.