షిరిడిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణ వాసులు మృతి

హైదరాబాద్: మహారాష్ట్రలోని షిరిడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన కొందరు కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సాయి బాబా దర్శనం కోసం షిర్డీ వెళ్లారు. 

దర్శనం పూర్తి కావడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ALSO READ | ఛత్తీస్ గఢ్‎లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు మృతి

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను ప్రేమలత(59), వైద్విక్ నందన్(6 నెలలు), అక్షిత(20), ప్రసన్న లక్ష్మీ(45)గా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని పోలీసులు తెలిపారు. దైవ దర్శనం కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో ఒకేసారి కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో కొండగడప గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.