అంకారా: దట్టమైన పొగ మంచు, లో విజిబిలిటీ కారణంగా టర్కీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏడు వాహనాలు ఒకదానితో మరొకటి ఢీ కొనడంతో 10 మంది మృతి చెందారు. 57 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మూడు ఇంటర్ సిటీ బస్సులు దెబ్బ తిన్నాయి. ఇస్తాంబుల్ కు 150 కిమీల దూరంలో సకార్య ప్రావిన్స్ లోని నార్తర్న్ మర్మారా హైవేపై ఈ దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని సకర్య గవర్నర్ యాసర్ కరాడెనిజ్ చెప్పారు. లో విజిబిలిటీ కారణంగా ఓ వాహనం.. ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే అందులో ప్రయాణిస్తున్నవారు కిందకు దిగడంతో వెనుక నుంచి వచ్చిన ఇతర వాహనాలు వారిని ఢీ కొన్నాయని వెల్లడించారు. దీంతో వారు మరణించినట్టు తెలుస్తోందని వివరించారు.