ఉత్తరప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. 13 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి.. 13 మందికి గాయాలు

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని హత్రాస్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న వ్యాన్‎ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‎లోని ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్ బలంగా ఢీకొట్టడంతో ప్యాసింజర్ వ్యాన్ నుజ్జునుజ్జు అయ్యింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై హత్రాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గురైన వ్యాన్ హత్రాస్‌లోని కుమారై గ్రామం నుంచి ఎటాలోని నాగ్లా ఇమాలియా గ్రామానికి వెళ్తోందని.. ఈ క్రమంలోనే కొత్వాలి హత్రాస్ జంక్షన్ పరిధిలోని సేలంపూర్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించారని.. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడని చెప్పారు. మరో 13 మంది గాయపడగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. 

Also Read :- గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

మరోవైపు హత్రాస్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరగా సహయ చర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చికిత్స పొందుతోన్న వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రాణ నష్టంతో శోక సంద్రంలో ఉన్న మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.