లక్నో/పిలిభిత్/చిత్రకూట్: ఉత్తరప్రదేశ్‌లోని రోడ్లు నెత్తురోడాయి. శుక్రవారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 20 మంది మృతిచెందారు. మరో 29 మంది గాయాలపాలయ్యారు. తెల్లవారుజామున 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న స్లీపర్‌బస్సు.. వాటర్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, 19 మందికి గాయాలయ్యాయి. కన్నౌజ్ జిల్లాలోని ఔరైయా సరిహద్దు సమీపంలో ఆగ్రా- లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ యాక్సిడెంట్జరిగింది.
పోలీసులు, రెస్క్యూ బృందాలు స్పాట్‌కు చేరుకొని గాయపడిన వారిని సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా జిల్లా అధికారులు స్పాట్‌కు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. అటుగా వెళ్తున్న జలవనరుల శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ సైతం సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించేలా చూశారు. బస్సు లక్నో నుంచి ఢిల్లీకి వెళుతోందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
పిలిభిత్‌లో ఆరుగురు..
పిలిభిత్ – తనక్‌పూర్ రహదారిపై నియోరా ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. 11 మందితో ప్రయాణిస్తున్న కారు మరొక వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించి.. అదుపు తప్పి చెట్టును ఢీకొని కాలువలో పడిపోయింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గంటన్నరకు పైగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి.. బుల్‌డోజర్‌తో చెట్టును తొలగించి ప్రయాణికులను బయటకు తీశారు.
అయితే, 11 మందిలో ఆరుగురు చనిపోయారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి క్రిటికల్‌గా ఉండడంతో మెరుగైన ట్రీట్మెంట్కోసం తరలించారు. బాధితులు ఉత్తరాఖండ్‌లోని ఖతిమా జిల్లా జమూర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పిలిభిత్‌లోని చండోయ్ గ్రామంలో వారు ఓ పెండ్లికి అటెండ్ అయ్యి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
చిత్రకూట్‌లో మరో ఆరుగురు..
రాయ్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రకూట్‌లో మరో ప్రమాదం జరిగింది. కారు.. ట్రక్కును ఢీకొని ఆరుగురు వ్యక్తులు మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్జరిగింది. 11 మందితో ప్రయాగ్‌రాజ్ నుంచి వెళ్తున్న కారు.. రాయ్‌పురా నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్జరిగిందని పోలీసులు తెలిపారు.
గాయపడిన ఆరుగురిని ప్రాథమిక చికిత్స తర్వాత జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధితులకు సరైన సహాయం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు.