
- కరీంనగర్ లో 72.54 శాతం ఓటింగ్
- గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం
- గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లోనూ ధీమా
- మానకొండూరు నియోజకవర్గంలో అత్యధికంగా 77.75 శాతం ఓటింగ్
కరీంనగర్, వెలుగు: పోలింగ్ ముగిసింది.. స్ట్రాంగ్ రూమ్ ల్లోని ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజీ 3 శాతం పెరిగినప్పటికీ.. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అతి తక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి 100 మంది ఓటర్లలో కేవలం 60 మంది మాత్రమే ఓటేశారు. కరీంనగర్ లోక్‌సభ పరిధిలో 17,97,150 మంది ఓటర్లు ఉండగా 13,03,690(72.54 శాతం) మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో 69.52 శాతం పోలింగ్ నమోదైతే.. ఈసారి గతంలో కంటే 3.24 శాతం ఎక్కువగా నమోదవడం విశేషం.
మానకొండూరులో 77.73 శాతం ఓటింగ్
కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 2,25,386 మంది ఓటర్లు ఉండగా అత్యధికంగా 1,75,228 మంది(77.75 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్‌లో 2,47,701 మందికిగానూ1,91,361(77.25 శాతం) మంది, చొప్పదండిలో 2,33,546 మంది ఓటర్లకుగానూ 1,76,001 మంది ఓటర్లు(75.36), సిరిసిల్లలో 2,46,547 మంది ఓటర్లకు 1,85,573 మంది(75.27 శాతం), వేములవాడలో 2,26,188 మందికిగానూ, 1,68,373 మంది(74.44 ), హుజురాబాద్ లో 2,50,429 మంది ఓటర్లకుగాను 1,84,858 మంది(73.82) ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3,67,353 మంది ఓటర్లు ఉండగా అతి తక్కువగా 2,22,296 మంది(60.51 శాతం) మాత్రమే ఓటేశారు.
స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలు
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూమ్‌ల్లోని ఈవీఎంల్లో భద్రంగా ఉంది. పోలింగ్ ప్రక్రియ పూర్తికాగానే కరీంనగర్, చొప్పదండి మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీకి సోమవారం అర్ధరాత్రి చేరుకున్నాయి. పటిష్టమైన భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో అధికారులు ఈవీఎంలను తరలించారు.
మంగళవారం ఉదయం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను కలెక్టర్ పమేలా సత్పతి, ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు మరో 20 రోజుల గడువు ఉండడంతో రిజల్ట్ వచ్చే వరకు అభ్యర్థులకు టెన్షన్ తప్పేలా లేదు. ఎన్నికలు పూర్తవడంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బండి సంజయ్, వెలిచాల రాజేందర్ రావు, వినోద్ కుమార్ ఎవరికి వారే తమదే విజయమంటూ లెక్కలేసుకుంటున్నారు.
అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ పర్సంటేజీ
మానకొండూరు 77.75
హుస్నాబాద్ 77.25
చొప్పదండి 75.36
సిరిసిల్ల 75.27
వేములవాడ 74.44
హుజురాబాద్ 73.82
కరీంనగర్ 60.51
లోక్‌సభ పర్సంటేజీ 72.54